హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ ను ఈనెల 30 వరకు పొడగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత ముఖ్యమంత్రి లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న భేటీ కావాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు. తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఈ నాలుగు గంటల సమయంలో కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. ఇక ఇప్పుడు కరోనా కేసులు కొంత మేర తగ్గతున్నా.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మరో తొమ్మిది రోజుల పాటు లాక్ డౌన్ ను పొడగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.