ఎవరినైనా అదే పనిగా ఇబ్బంది పెడుతూ ఉంటే.. ఏరా జలగలా అలా పట్టి పీడిస్తున్నావ్ అంటారు. ఎందుకంటే జలగలు పట్టుకున్నాయంటే అంత ఈజీగా విడిచిపెట్టవు. మన రక్తాన్ని పీలుస్తూ.. చాలా గట్టిగా శరీరానికి అతుక్కుపోతాయి. జలగను శరీరం నుంచి వేరు చేయటానికి చాలా కష్టపడాలి. అలాంటి జలగ గొంతులోకి వెళ్లి అతుక్కుపోతే పరిస్థితి ఏంటి? ఆలోచించటానికే ఇబ్బందిగా ఉంది కదూ. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఓ వ్యక్తి స్వయంగా అనుభవించాడు. ఒకరోజు, రెండురోజులు కాదు ఏకంగా 15 రోజులు అల్లాడిపోయాడు. చివరకు డాక్టర్ల సహాయంతో ప్రాణాలు రక్షించుకున్నాడు.
ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ లోని మిరిక్‌కు చెందిన 49 ఏళ్ల సజిన్ రాయ్ 15 రోజుల క్రితం కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కొండ ప్రాంతంలో కలియ తిరుగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి బాగా దప్పిక వేసింది. నీటి కోసం వెతకగా ఓ నీటి కుంట కనిపించింది. అసలే విపరీతమైన దప్పికగా ఉండటంతో ఇక, ఏమీ ఆలోచించకుండా గుటగుటా అందులోని నీటిని తాగేశాడు. నీటితో పాటే ఓ జలగ కూడా నోటిలోకి వెళ్లింది. గొంతు లోపల ఇరుక్కుపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాతి నుంచి అతడి ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందిగా మారింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు.
దాదాపు 15 రోజుల పాటు అలాగే గడిపేశాడు. ఆ తర్వాత ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది తారాస్థాయికి చేరింది. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లాడు. ఈఎన్‌టీ డాక్టర్ అతడి గొంతు పరీక్ష చేశాడు. లోపల జలగ ఉందని చెప్పాడు. కొన్ని గంటల్లోనే ఆపరేషన్ మొదలుపెట్టారు. దాదాపు గంటన్నర కష్టపడిన తర్వాత జలగను బయటకు తీశారు. అప్పటికీ కూడా ఆ జలగ బతికే ఉంది. తనకు సరైన వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్‌కు సజిన్ ధన్యావాదాలు తెలియజేశాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఈఎన్‌టీ వైద్యుడు స్పష్టం చేశాడు. తన 40 ఏళ్ల వైద్య వృత్తిలో ఇలాంటి కేసులు చూడలేదని స్పష్టం చేశాడు. మరి, మనిషి గొంతులో జలగ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.