ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్. వీడియోలు చేస్తూ వాటిని టిక్ టాక్ వంటి వాటిల్లో పోస్టు చేసేది. భర్త వద్దని మందలించాడు. అటు భర్త సైతం మరొకరితో తరచూ ఫోనులో మాట్లాడుతుండటంపై వీరిద్దరికీ గొడవ జరిగేది. భర్త ప్రవర్తన పట్ల మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. ఉరేసుకుని చనిపోతున్నట్లు భర్తకు సెల్ఫీ తీసి పంపింది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ కు చెందిన రాజన్ పరియార్ అలియాస్ రాజేష్ ఏడాదిన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన పూజ పరియార్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలల తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చారు. జూబ్లీహిల్స్ లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే శైలుబాబు అనే వ్యాపారి వద్ద పనికి చేరి అక్కడే క్వార్టర్స్ లో నివసిస్తున్నారు. పూజ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం నచ్చని భర్త వద్దని వారించాడు. భర్త కూడా మరో అమ్మాయితో మాట్లాడుతుండటాన్ని సహించలేని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
బాత్ రూంలో చున్నీతో ఉరి వేసుకున్నట్లు ఒక ఫోటోను పంపింది. అయితే బయట పనిలో బిజీగా ఉన్న భర్త సాయంత్రం ఆ ఫోటో చూసి ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో వాటిని బాదాడు. ఎంతకూ తీయకపోవడంతో గట్టిగా నెట్టడంతో తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. పూజ.. ప్యానుకు వేలాడుతూ కనిపించింది. 108 ఫోన్ చేయగా.. ఆ సిబ్బంది వచ్చి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇద్దరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె పంపిన ఫోటోలో ఉన్న చున్నీ, ఆమె ఉరి వేసుకున్న చున్నీ వేరు వేరుగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.