హైదరాబాద్- కరోనా సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఈమేరకు ఏయే రంగాల్లో ఆదాయం సమకూరుతుందో పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అందులో భాగంగానే తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈనెల 22 నుంచి పెరిగిన భూముల ధరలు అమలులోకి రానున్నాయి. తెలంగాణలో భూముల విలువను 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచారు. ఆ తరువాత గత ఏడేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం భూముల విలువ పెంచలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న భూములు, ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో, వాటి విలువను పెంచాలని ప్రభుత్వం గత క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
ఇక వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెంచారు. రాష్ట్రంలో ఎకరా భూమి ధర కనిష్టంగా 75 వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఓపెన్ ప్లాట్ ధర గజం 200 మేర పెంచారు. అపార్ట్ మెంట్ లో చదరపు అడుగుకు వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భూముల విలువను ఏ ప్రాంతంలో ఏ మేరకు పెంచారనే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.