మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ నేతలంతా మాటల యుద్ధం చేస్తున్నారు. కేవలం వారే కాదు వైసీపీ అభిమానులు సైతం పవన్ ఫై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేశారని ప్రజల హృదయాలు గెల్చుకున్నారని మరి పవన్ కల్యాణ్ అలా పాదయాత్ర చేయగలరా.. పది అడుగుల పాదయాత్ర చేసి.. జనం ఎక్కువగా కనిపిస్తే కారు ఎక్కే పవన్.. సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ సిద్దాంతం ఏంటో ఆయనకు తెలుసా… ఓ సారి టీడీపీతో మరోసారి కమ్యూనిస్టులు, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటాడని లక్ష్మి పార్వతి అన్నారు. పవన్ కళ్యాణ్ విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కించ పరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు.. అతని రాజకీయాలకు వారసత్వాన్ని లోకేష్, పవన్ సాగిస్తున్నారని.. ఆయన విష వృక్షం నీడలో ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి బయటకు వస్తే తప్ప ముందుకు వెళ్లలేరని చెప్పారు.
ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్‌లైన్ టికెట్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందన్నారు. ఒక నాయకుడిగా ముందుకు వెళ్లాలనుకుంటున్న పవన్.. దొంగ టికెట్ల అమ్మకాలకు మద్దతుగా నిలిస్తే లీడర్ ఎలా అవుతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని.. ఆయన జోలికి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వరుస విజయాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఎప్పుడూ బయటకే రాని పోసాని భార్యను కూడా అవమానించడం అంటే ఏ స్థితికి పవన్ కల్యాణ్ దిగజారాడో అర్థం అవుతుందని నిప్పులు చెరిగారు లక్ష్మీ పార్వతి.