హైదరాబాద్- కబ్జా.. ఈ పదాన్ని మనం చాలా సందర్బాల్లో వింటుంటాం. పట్టణాలు, నగరాల్లో ఖరీదైన స్థలాలను, పొలాలను కొంత మంది రాజకీయ నాయకులు, దాదాలు, రౌడీలు, అధికారవర్గాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు కబ్జా చేస్తుంటారు. ఐతే ఇప్పటివరకు జరిగిన కబ్జా కేసుల్లో కేవలం మగవాళ్ల పేర్లు మాత్రమే బయటకు వస్తుండగా, ఇప్పుడు ఏకంగా ఆడవాళ్లు కూడా కబ్జాలకు పాల్పడటం ఆసక్తిరేపుతోంది.
అవును హైదరాబాద్ లో కిలాడీ లేడీ గ్యాంగ్ ఒకటి ఓ మహిళకు సంబందించిన స్థలాన్ని కబ్జా చేసింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కబ్జా వ్యవహారాన్ని చూసి పోలీసులే నోరెల్లబెట్టారు. బతికుండగానే యజమాని చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ పుట్టించిన కిలాడీ లేటీలు, ఆమె బహుమతి కింద రాసేసినట్లుగా పత్రాలు సృష్టించారు. తీరా అసలు స్థల యజమాని వస్తే తన్ని తరిమేశారు.
హైదరాబాద్ లోని సరూర్ నగర్ పరిధిలో కొత్తపేటకి చెందిన 71 ఏల్ల పచ్చి పులుసు వరలక్ష్మి కుమారి స్థానిక రామకృష్ణాపురం అష్టలక్ష్మీ దేవాలయం వద్ద నివసిస్తోంది. ఆమెకు రామంతాపూర్ లోని శ్రీరంగపురం చర్చి కాలనీలో ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన తరువాత ఆమె కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకుంది. అప్పటి నుంచి రెండు మూడు నెలలకొకసారి వెళ్లి ప్లాట్‌ను చూసుకునేది. ఐతే అనారోగ్య కారణాలవల్ల గత నాలుగేళ్లుగా ఆమె ప్లాట్ వద్దకు వెళ్లడం లేదు.
ఎప్పటి నుంచో ఆ స్థలంపై కన్నేసిన 33 ఏళ్ల బ్యూటీషియన్ పసల జ్యోతి ఇదే అదనుగా భావించి ప్లాట్ కబ్జా చేసేందుకు పధకం వేసింది. ఆమె కూతురు 19 ఏళ్ల పసల వెన్నెల, స్నేహితురాలు 27 ఏళ్ల జ్యోతి తో కలిసి కుట్ర పన్నింది. ఈ ముగ్గురు మహిళలు మరో తొమ్మిది మంది గ్యాంగ్ తో చేతులు కలిపి నకిలీ పత్రాలను సృష్టించారు. స్థల యజమాని వరలక్ష్మి కుమారి 2014లో చనిపోయినట్లుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఓ గ్రామపంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
వరలక్ష్మి కుమారి పేరుమీద ఉన్న స్థలాన్ని జ్యోతి కూతురు వెన్నెల పేరుపై గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయించారు. విషయం తెలిసుకున్న ప్లాట్ యజమాని వరలక్ష్మి కుమారి అక్కడకు వెళ్లడంతో ఆమెను బెదిరించి అక్కడి నుంచి తరిమేశారు. కంగారుపడిన ఆమె ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నకిలీ ధ్రువపత్రాలతో స్థలాన్ని కబ్జా చేసినట్లు తేల్చారు. కబ్జాకి పాల్పడిన ముగ్గురు కిలాడీ లేడీలను అరెస్టు చేశారు.