సినీ ప్రపంచంలో నటశేఖరుడిగా వెలిగి.. ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. కృష్ణ మృతి ఆయన కుటుంబానికే కాక.. ఇండస్ట్రీకి కూడా తీరని లోటు. సినీ ప్రపంచంలో కృష్ణ చేసినన్ని సాహసాలు ఏ హీరో చేయలేదు. ఒక్క ఏడాదే సుమారు 18 సినిమాలు విడుదల చేసి రికార్డు క్రియేట్ చేశారు. తెర మీదే కాక నిజజీవితంలో కూడా ఎంతో గొప్ప వ్యక్తిగా ప్రశంసలు పొందారు. కృష్ణ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. అసలు ఈ ఏడాది కృష్ణ కుటుంబానికి ఏమాత్రం అచ్చి రాలేదు. కుటుంబంలోని పెద్దలంతా ఒకరి తర్వాత ఒకరు కన్ను మూస్తున్నారు. ముందు రమేష్ బాబు మృతి చెందగా.. తర్వాత ఇందిరా దేవి.. ఇప్పుడు కృష్ణ చనిపోయారు. వరుస విషాదాలతో.. మహేష్‌బాబు కుటుంబం తీరని మనోవేదనను అనుభవిస్తోంది.
ఇక కృష్ణ మృతి చెందాడు అనే వార్త తెలిసి.. అభిమాన హీరో కడసారి చూపు కోసం అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు. సుదూర ప్రాంతాల నుంచే కాక.. వేరే రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే తండ్రి మరణంతో తీవ్ర దుఖంలో ఉన్న మహేష్ బాబు.. ఇలాంటి సమయంలో కూడా అభిమానుల గురించి ఆలోచించాడు. తన తండ్రిని ఆఖరి సారి చూడ్డం కోసం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్న అభిమానులకు భోజనం ఏర్పాటు చేసి.. వారి పట్ల తన ప్రేమను చాటుకున్నాడు మహేష్ బాబు.
కృష్ణ మరణించారు అనే వార్త తెలియగానే.. చాలా మంది.. ఆయన కడసారి చూపు కోసం వచ్చేశారు. తమ మీద ఇంతటి అభిమానం చూపుతూ.. దూరభారం లెక్క చేయక.. గంటల కొద్ది క్యూలైన్లో నిల్చుని.. మరి తండ్రికి నివాళులర్పించిన అభిమానుల కోసం భోజన ఏర్పాటు చేశాడు మహేష్ బాబు. ఇంతటి విషాదంలోను ఫ్యాన్స్ కోసం ఆలోచించి.. మంచి మనసు చాటుకున్నందుకు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. కృష్ణ మృతి నేపథ్యంలో సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో.. బుధవారం మధ్యాహ్నం మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.