ఫోన్ ట్యాప్ ఆరోపణలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. కోటంరెడ్డి వర్సెస్ వైఎస్సార్ సీపీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
వైఎస్సార్ సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోటంరెడ్డి వర్సెస్ వైఎస్సార్ సీపీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి జైలుకు వెళ్లటం ఖాయం అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తనకు జైలు కొత్తేమీ కాదని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అన్నిటికి తెగించిన వాళ్లే నాతో ఉన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. అది నాకేమన్నా కొత్తా.. వీఆర్‌ఐ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నపుడు.. ఎమర్జెన్సీ సమయంలో కేరళకు చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు.
అప్పుడు ధర్నా చేశాను. నన్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వేశారు. అక్కడినుంచి స్టార్ట్ అయింది. లాకప్‌లు చూశాను. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాను. దీంతో మమ్మల్ని జైల్లో వేశారు. ఒళ్లంతా కుళ్ల బొడిచారు. భలే ఉంటాయి సార్ దెబ్బలు. భలే బాధేస్తాయి. అరికాళ్లలో కొడితే దెబ్బ తలకు తగులుతుంది. ఎందాకైనా సిద్ధం. తగ్గేదేలా.. రెండో ఆలోచన లేదు. ఎవరినీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తే.. అక్రమంగా వేధించాలనుకుంటే.. మాకుండే దారులు మాకుంటాయి. మా దారులు ప్రజాస్వామ్య బద్ధమైనదారులు..
రాజ్యాంగ బద్దమైన దారులు. నేను భగవంతుడ్ని బాగా నమ్ముతాను. నేను తప్పు చేసి ఉంటే భగవంతుడే శిక్ష వేస్తాడు. ప్రజలు నాకు శిక్ష వేస్తారు. తప్పు చేయకుండా ఉంటే.. భగవంతుడు నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కాగా, తన సెల్‌ఫోన్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ కోటంరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనమీద అనుమానంతో ఇలా చేసిందని ఆయన అన్నారు. టీడీపీకి తన మద్దతు తెలిపారు. చంద్రబాబు చెప్పిన చోటు నుంచి పోటీ చేస్తానని అన్నారు. అయితే, కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ చేయలేదని, ఆయన స్నేహితుడే కోటంరెడ్డి ఫోన్ కాల్‌ను రికార్డ్ చేశాడని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.