హైదరాబాద్- ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో శనివారం ఉదయం రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు.
ఐతే ఆస్పత్రికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలోనే రోశయ్య చనిపోయారు. ఈమేరకు స్టార్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. రోశయ్య పార్ధివదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వెళ్లారు. శనివారం ఉదయం లో-బీపీతో హఠాత్తుగా రోశయ్య క్రింద పడిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు.
రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మొత్తం 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
14 నెలల పాటు ఏపీ సీఎంగా పనిచేశారు. ఆతరువాత తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పనిచేశారు. గత కొంత కాలంగా వయసు రిత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. రోశయ్య మృతి పట్ల పార్టీలకు అతీతంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.