దేశంలో ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే.., మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీలకి హద్దే లేకుండా పోతుంది. కూకట్ పల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ కి 22 లక్షలు బిల్ వేసిన ఘటన మరవకముందే.., తాజాగా మళ్ళీ అలాంటి ఘటనే బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ తీవ్ర జ్వరంతో ఈనెల 9 విరించి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అతని వయసు 35 సంవత్సరాలు. వంశీకృష్ణకి కరోనా సోకినా.., జ్వరం తప్ప మరే ఇతర లక్షణాలు బయటపడలేదు. శ్వాస తీసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడుతూ వచ్చాడు. దీనితో.. 17 రోజుల చికిత్స చేసిన వైద్యులు.. గురువారం మధ్యాహ్నం అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పటికే మొత్తం హాస్పిటల్ బిల్ రూ.20 లక్షల అయ్యింది. దీంతో.., ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. వైద్యులు సరైన చికిత్స చేయకుండా, స్టెరాయిడ్స్ అధికంగా ఇవ్వడంతో లంగ్స్, కిడ్నీలు పాడై తన అన్నయ్య చనిపోయాడని మృతుని సోదరి ఆరోపించింది. వైద్యం చేసిన డాక్టర్ తమకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏ తప్ప చేయకపోతే డబ్బులు కట్టకుండా శవాన్ని ఎందుకు తీసుకెళ్లమని చెప్పారని ఆమె ప్రశ్నించింది. తన అన్న చనిపోలేదని, వైద్యులే చంపేశారని ఆమె ఆరోపించింది.
ఆసుపత్రి యాజమాన్యం, బంధువుల మధ్య ఘర్షణ పెరగడంతో మృతిని బంధువులు దాడి చేసి హాస్పిటల్ ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అరెస్టు చేసి.., గోషామహల్ పోలీసుస్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రైవేటు ఆసుపత్రులు రోగుల ప్రాణాలు తీయడమే కాకుండా.., వైద్య చికిత్స గురించి అడిగినందుకు మృతునికి కుటుంబానికి చెందిన 16మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. చనిపోయిన వ్యక్తి బంధువుల బాధని అర్ధం చేసుకోకుండా వారిని అరెస్ట్ చేయడం ఏమిటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.., ఈ విషయంలో పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. ట్రీట్మెంట్ లో ఏదైనా సమస్య వల్లే అతను చనిపోయాడని అనుమానాలు ఉన్నప్పుడు తమకి కంప్లైంట్ ఇవ్వాలని.., అంతేగాని ఇలా హాస్పిటల్ పై దాడికి తెగబడటం నేరం అవుతుందని పోలీసులు తెలియచేశారు. మరోవైపు యువకుని ప్రాణాలు తీసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యం చేసిన డాక్టర్పై కేసు పెట్టి, మృతుని కుటుంబానికి నష్టం పరిహారం చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.