హైదరాబాద్- ఖైరతాబాద్ మహాగణపతి ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ లోని అతి పెద్ద వినాయక విగ్రహాల్లో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకోవడానికి సిద్దమవుతాడు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
ఐతే కరోనా నేపధ్యంలో ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహ ఎత్తును భారీగా తగ్గించారు. రెండేళ్ల క్రితం 61 అడుగులున్న ఖైరతాబాద్ గణపయ్య విగ్రహాన్ని, గత యేడాది కేవలం 9 అడుగులకు పరిమితం చేశారు. ఐతే ఈ సారి కాస్త కరోనా తగ్గడంతో కాస్త గణేష విగ్రహం ఎత్తును పెంచారు. ఈ సారి 40 అడుగుల మేర వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు.
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ సమితి విడుదల చేసింది. శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశ్ భక్తులకు దర్శనమిస్తారు. 40 అడుగుల ఎత్తులో ఈ ఏడాది గణనాథుడు కొలువుదీరనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ కుడి వైపున 15 అడుగుల ఎత్తులో కృష్ణ కాళీ విగ్రహాన్ని, ఎడమ వైపున 15 అడుగుల ఎత్తులో కాల నాగేశ్వరి విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు.