న్యూ ఢిల్లీ- తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రజా రంజక పాలన అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి వరుసలో ఉంటారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, మిషన్ భగీరధ వంటి ఎన్నో పధకాలను ఇతర రాష్ట్రాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకరించాయంటేనే మనకు అర్ధం అయిపోతుంది. మరి హఠాత్తుగా ఏంజరుగుతుంతో తెలియదుకానీ, కేసీఆర్ గ్రాఫ్ మెల్ల మెల్లగా పడిపోతోంది.
తెలంగాణ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాగ్రహం బాగా పెరిగిపోయింది. అవును దేశంలో ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారు. జాతీయ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఈ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఆఖరి స్థానానికి పడిపోయారు. ప్రజాగ్రహంలో సీఎం కేసీఆర్ అందరు ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి మరీ ముందు వరుసలో నిలిచారు.
దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు. సుమారు 30.30 శాతం మంది సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేసీఆర్ తర్వాత తీవ్ర ఆగ్రహం ఎదుర్కొంటున్న సీఎంలలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఇక దేశంలో ప్రజాగ్రహం తక్కువగా ఉన్న ముఖ్యమంత్రులలో చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బగేల్ మొదటి స్థానంలో ఉన్నారు.
కేవలం 6 శాతం మంది మాత్రమే ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. గతంలో మరో జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ పై 84 శాతం వ్యతిరేకత ఉందని తేలింది. తమ సర్వేలో ఎక్కువ మంది ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యతిరేకత వ్యక్తం చేశారని సదరు సంస్థ తెలిపింది.