హైదరాబాద్- తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కట్టడి కోసం మరింత కఠనంగా ఆంక్షలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డిలోను భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కరోనా ఆంక్షలను మరింత కాలం పొడిగించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీ వరకూ కరోనా ఆంక్షలు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో సమావేశాలు, సభలు, మతపరమైన కార్యక్రమాలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధించింది.
కరోనా ఉధృతి నేపథ్యంలో ఆంక్షలను జనవరి నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడి కోసం నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈనెల 31 వరకూ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, కరోనా ఆంక్షలను కూడా అప్పటి వరకూ పొడిగించింది.
రాష్ట్రంలో పరిస్థితి ఇలానే కొనసాగితే నైట్ కర్ఫ్యూతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించే అవకాశముందని అధికారులు చెప్పారు. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 92 శాతం ఒమిక్రాన్ కేసులే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సూచించారు.