బెంగళూరు- క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు, అసలు మ్యాచ్ ఫిక్సింగ్ శిక్షార్హమే కాదు.. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కర్ణాటక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. అవును క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ పై కర్ణాటక హైకోర్టు ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హం కూడా కాదని తేల్చి చెప్పింది.
కర్ణాటక ప్రీమియర్ లీగ్ 2019 మ్యాచ్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం, మ్యాచ్ ఫిక్సింగ్ కేసును కొట్టి వేస్తూ, దోషులను శిక్షించడం బీసీసీఐ అధికార పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది.
ఐపీసీ ప్రకారం వీమ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినవారిపై చీటింగ్ కేసు వర్తించదని, ఓ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే.. క్రీడను అమితంగా అభిమానించే ప్రేక్షకులను మోసం చేశాడన్న భావన కలగడం సహజమని హైకోర్టు పేర్కొంది. ఐతే దీన్ని పరిగణలోకి తీసుకుని నిందితులను శిక్షించే హక్కు కోర్టుకు లేదని, ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునే అధికారం సంబంధిత క్రికెట్ బోర్డులకే ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.
2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు కేపీఎల్ లోని పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సహా ఓ బుకీపై బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబందించిన విచారణ ముగియడంతో హైకోర్టు తీర్పు వెలువరించింది.