జీవితంలో కొందరు చదువుకుని వృద్ధిలోకి వస్తారు.. ఇంకొందరు వ్యాపారంతో పైకొస్తుంటారు. చాలామంది కాయాకష్టం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అయితే జీవితంలో చదువుకుంటేనే బాగుపడతారు, ఉద్యోగం ఉంటేనే బతికి బట్టకడతారు అనేది వాస్తవం కాదు. అలా ప్రభుత్వ కొలువు రాలేదనో, కోరుకున్న ఉద్యోగం సాధించలేకపోయాననో ప్రాణాలు తీసుకోవడం క్షమించరాని నేరం. అలా ఓ యువతి ఎస్‌ఐ పరీక్ష సరిగ్గా రాయలేదని ప్రాణాలు తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో ఈ ఘటన జరిగింది. పంచశీల(20) అనే యువతి హైదరాబాద్‌లో ఉంటోంది. పంచశీల గత ఆదివారం జరిగిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసింది. అయితే పరీక్ష సరిగ్గా రాయలేదని ఆమె మనస్తాపానికి గురైంది. పరీక్ష అయిపోయాక నేరుగా ఇంటికి బయల్దేరింది. కామారెడ్డి వెళ్లేందుకు బయల్దేరిన పంచశీల మార్గం మధ్యలో జంగంపల్లి వద్ద బస్సు దిగేసింది.
ఆ తర్వాత జంగంపల్లి గ్రామంలోని చెరువులో దూకి పంచశీల ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పంచశీల మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. పరీక్ష సరిగ్గా రాయకపోవడం వల్లే ప్రాణాలు తీసుకుని ఉండచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.