కడప రూరల్- మన దేశంలో పోలీసులు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. చాలా సార్లు సినిమాల్లో చూపించిన విధంగా అంతా అయ్యాక చివరిలో వస్తుంటారు పోలీసులు. కానీ కొన్ని సందర్బాల్లో మాత్రం సకాలంలో వచ్చి నేరాలు జరక్కుండా అదుపు చేస్తుంటారు కూడా. ఈ మధ్యకాలంలో దొంగతనాలు, దోపిడీలు, సైబర్ నేరాల్లో పోలీసులు బాగా పనిచేస్తున్నారు. సరైన టైంలో చాకచక్యంగా కేసులను ఛేదిస్తున్నారు మన పోలీసులు.
ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప పోలీసులు మరోసారి రుప్రదర్శించారు. స్థానికంగా ఆటోలో వెళుతున్న ఓ మహిళ డబ్బు, బంగారం ఉన్న బ్యాగ్ మర్చిపోయి దిగేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేవలం అరగంటలోనే ఆటోను పట్టుకుని బ్యాగ్ ను బాధితురాలికి అప్పగించారు. అసలేం జరిగిందంటే.. కడప పట్టణంలోని శంకరాపురంకు చెందిన ఓ మహిళ షాపింగ్ కోసం వచ్చింది. తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఆటోలో ఇంటికి వెళ్తూ తన హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలోనే మరచిపోయింది.
తీరా ఇంటికి వెళ్లాక బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె షాక్ అయ్యింది. వెంటనే ఆ మహిళ కడప వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ సత్యనారాయణ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కడప కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వై.వీ స్ట్రీట్ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో వాల్‌లో గమనించారు. కేవలం 30 నిమిషాల్లో ఆ మహిళ ఎక్కిన ఆటోను గుర్తించి, డ్రైవర్ ను పట్టుకున్నారు. ఆ బ్యాగును ఆటోలో నుంచి స్వాధీనం చేసుకుని బాధితురాలికి హ్యాండ్ బ్యాగ్ ను అప్పగించారు.
బ్యాగులో ఉన్న తన బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డులను చూసుకున్న మహిళ రిలాంక్స్ అయ్యింది. చాలా తక్కువ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి తనకు తన బ్యాగ్ ను అప్పగించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. కేవలం 30 నిమిషాల్లోనే ఆటోను గుర్తించి అందులోని బ్యాగ్ ను బాధితురాలికి అందించేందుకు కృషి చేసిన కడప వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, కడప కమాండ్ కంట్రోల్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు.