టీడీపీ.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.., కేంద్రంలో కూడా చక్రం తిప్పిన పార్టీ. దేశ ప్రధానులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ. కానీ.., ఈ ఘనత అంతా గతం మాత్రమే. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతూ వస్తోంది. తెలంగాణలో అయితే సైకిల్ పార్టీకి నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో ఏపీలో కూడా పసుపు జెండా రెపరెపలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి.
అయితే.., రాజకీయాల్లో ఈ పరిస్థితి ఎవరికైనా తప్పదు. తమ టైమ్ కాదనుకుని చంద్రబాబు కామ్ గా ఉన్నారు. ఒక్క అవకాశం వస్తే చక్రం తిప్పేయగల నేర్పు బాబు సొంతం. కాబట్టే చంద్రబాబు ఈ పరిస్థితికి భయపడటం లేదు. కానీ.., ఆయన్ని టెన్షన్ పెడుతుందల్లా తారక మంత్రమే. అవును.. జూనియర్ యన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు బాబుకి పెద్ద తలనొప్పిగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కళ తప్పుతున్న నేపధ్యంలో పార్టీ పగ్గాలు జూనియర్ కి అప్ప చెప్పాలన్న డిమాండ్ రోజురోజుకి ఎక్కువ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో అమరావతి టూర్ లో పార్టీలోకి జూనియర్ ని తీసుకుని రమ్మని చంద్రబాబునే నిలదీశారు తెలుగు తమ్ముళ్లు. ఆ సమయంలో ఆయన అవసరమైతే లోకేశ్ ని పంపిస్తా అంటూ అక్కడ నుండి బయటకి వచ్చేశారు.
ఇక్క మొన్నటికి తిరుపతి ఉపఎన్నికల సమయంలోబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జూనియర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ సమయంలో కూడా చంద్రబాబు ఉటాహుటిన అక్కడ నుండి నివేదికలు తెప్పించుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా చంద్రబాబు టూర్ లోనే జూనియర్ యన్టీఆర్ జెండాలు ప్రత్యక్షం అవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.
మచిలీపట్నం సీనియర్ నేత కాగిత వెంకట్రావ్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు బందర్ వచ్చారు. అక్కడే తారక మంత్రంతో యన్టీఆర్ అభిమానులు రెచ్చిపోయారు.
జెండాపై తారక్ బొమ్మ పెట్టి.., కింద భాగంలో నెక్స్ట్ సీఎం అంటూ రాసి.., కాబోయే సీఎం తారక్ అంటూ నినాదాలు చేశారు. ఇలా తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలతో పాటు.., జూనియర్ జెండాలను కూడా పట్టుకుని ముందుకి సాగడం విశేషం. ఒక్క బందర్ లో మాత్రమే కాదు, మచిలీపట్నంలోనూ జూనియర్ జెండాలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.., తెలుగు తమ్ముళ్లు పార్టీలోకి తారక్ రాకని ఎంత బలంగా కోరుకుంటున్నారో చంద్రబాబుకి అర్ధమయ్యేలా చెప్పినట్టు అయ్యింది. మరి.. టీడీపీ పగ్గాలు జూనియర్ యన్టీఆర్ కి అందించాలని మీరు కోరుకుంటున్నారా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.