హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ మరింత సమయం కావాలని కోరింది.
సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకనే మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఐతే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది సీబీఐకి సమయం ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు ఇంతటితో విచారణ పూర్తైందని స్పష్టం చేసింది. సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఆగష్టు 25న తుది తీర్పును వెల్లడించనున్నారని రఘురామ తరపు న్యాయవాది తెలిపారు.
దీంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో సీబీఐ కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఆగష్టు 25న సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందన్నదానిపై సర్వాత్రా ఉత్కంఠ రేగుతోంది. ఒక వేల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ను సీబీఐ కోర్టు రద్దు చేస్తే తరువాత పరిస్థితి ఎంటన్నది వైసీపీని కలవరపరుస్తౌంది.
అదే గనుక జరిగితే ముఖ్యమంత్రి జగన్ మరో సారి జైలుకు వెళ్లక తప్పదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఐతే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ బెయిల్ ను కోర్టు రద్దు చేయకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం ఆగష్టు 25వరకు వేచిచూడాల్సిందే.