అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే పొత్తు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే పొత్తులపై రాజకీయ పార్టీలో సమాలోచనలు మొదలుపెట్టాయి. మొన్న కుప్పం పర్యటన సందర్బంగా జనసేనతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలని, వన్ సైడ్ లవ్ ఫలించదని జనసేనను ఉద్దేశించి చంద్రబాబు కామెంట్ చేశారు.
ఇదిగో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పొత్తుల కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం తాము బీజేపీతో మాత్రమే పొత్తులో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. పొత్తులకు సంబంధించి ప్రత్యర్థులు మైండ్ గేమ్ ఆడుతున్నారని, వాళ్ల ట్రాప్‌లో పడొద్దంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జనసేన కార్యనిర్వాహక సభ్యులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ ఈ కామెంట్ చేశారు. ఐతే అందరితో కలిసి చర్చించాకే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని, కానీ ప్రస్తుతం పొత్తుల కంటే పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని పవన్ సూచించారు.
తాను ఒక్కడినే సింగిల్‌గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తులనేవి ప్రజాస్వామ్యంగా, ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పారు. పొత్తులపై వివిధ పార్టీలు ఆడే మైండ్ గేమ్‌లో పావులు కావొద్దని కార్యకర్తలకు పవన్ సూచించారు. ప్రస్తుతం పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.