ఫిల్మ్ డెస్క్- ముక్కు అవినాష్.. ఈజబర్దస్త్ రియాల్టీ కామెడీ షో చూసేవారికెవ్వరికైనా ఈ పేరు సుపరిచితమే. జబర్దస్త్ లో అవినాష్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అవినాష్ ప్రతి స్కిట్టుకు కడుపుబ్బా నవ్వాల్సిందే. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్, పలువురు హీరోల పాత్రల్ని అనుకరించి తనదైన మార్క్ చూపించారు.
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’లోనూ ఆయన సందడి చేశారు. అన్నట్లు ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యారు. మొన్న అనుజతో వివాహ నిశ్చితార్ధం చేసుకున్న అవినాష్, బుధవారం ఆమెను పెళ్లి చేసుకునన్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అవినాష్, అనుజల వివాహం ఘనంగా జరిగింది.
అనుజ మెడలో అవినాష్ తాళికట్టే దృశ్యాల్ని జబర్దస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవినాష్ పెళ్లి సందర్బంగా రాంప్రసాద్ సరదా కామెంట్ కూడా చేశారు. క్షమించు అవినాష్.. చాలా పెద్ద తప్పు జరిగింది.. నేను సాయం చేయలేకపోయాను.. అని సరదాగా అవినాష్ పెళ్లి వీడియోకు కామెంట్ ను జత చేశారు ఆటో రాంప్రసాద్.
ఇక అవినాష్ పెళ్లి సందర్బంగా జబర్దస్త్ ఆర్టిస్టులు, అవినాష్ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అవినాష్ పెళ్లి ఫోటోలు, వీడియో బాగా వైరల్ అవుతోంది.