గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర ఈ మాటలు అందరికీ తెలిసినవే.. మన గురువు త్రిమూర్తులతో సమానం అని చెప్పడం. విద్యను అభ్యసించడం నుంచి కాలక్రమంలో మనకి ఎందరో గురువులు ఉంటారు. అలాంటి గురువులను గుర్తుచేసుకుంటూ ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ‘ఆచార్యదేవో భవ’ అంటూ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్‌లో నవ్వులు పూయించడమే కాదు.. ప్రేక్షకుల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తున్నాయి.
‘జబర్దస్త్’లో రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల్నితోనే చాలా స్కిట్లు చేసి టైమింగ్.. రైమింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల బుల్లితెర యాక్టర్ రోహిణీ ఎంట్రీతో రాకేష్ టీమ్ రెట్టింపు ఉత్సాహంతో రాక్ చేస్తోంది. ఇదంతా ఇప్పటి మాట.. ఒకప్పుడు రాకేష్ డౌన్ అయినప్పుడు టీమ్ లీడర్ నుంచి తప్పించినప్పుడు అతని పరిస్థితి ఏంటి? అప్పుడు అతను ఏం చేశాడు అన్నది తాజాగా బయటపెట్టాడు. టీమ్ లీడర్ నుంచి తప్పుకున్నప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసినట్లు బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
‘టీమ్ లీడర్‌గా నన్ను కొన్నిరోజులు తప్పించారు. అప్పుడు నాకు సూసైడ్ ఆలోచనలు వచ్చేవి. ఒకరోజు చనిపోవాలని నా కారును చెట్టుకు గుద్దేశాను. అలాంటి పరిస్థితుల్లో చంటి అన్న తన టీమ్‌లో పెట్టుకుని నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడంటూ’ రాకింగ్ రాకేష్ తన జీవితంలోని చీకటి క్షణాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రోమో బాగా వైరల్ అవుతోంది.