కొన్ని సార్లు మంచి పనులు చేసి ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మనం చేసేది మంచి పని అయినా.. ఓ నేరస్తుడిలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అచ్చం ఈ స్టోరీలో కూడా అంతే జరిగింది.
సాధారణం మనం ఎదైనా మంచి పని చేస్తే అందరూ మనల్ని పొగడ్డం పరిపాటి. మనం చేసే మంచి పని పెద్దదయితే.. సన్మానాలు, సత్కారాలు కూడా జరుగుతుంటాయి. కానీ, కొన్ని సార్లు మంచి పనులు చేసి ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. చేసిన మంచికి గుర్తింపు రాకపోగా.. ఎదురుగా మనమే కష్టాల పాలు కావాల్సి వస్తుంది. మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ వ్యక్తి మంచి పని చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. ఏకంగా 80 వేల రూపాయల ఫైన్‌కు గురయ్యాడు. ఈ సంఘటన ఇటలీలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. క్లాడియో ట్రెంటా అనే వ్యక్తి ఇటలీ, లాంబార్డీలోని బార్లసినాలో నివాసం ఉంటున్నాడు. ఓ రోజు అతడు రోడ్డు దాటుతుండగా.. నడిరోడ్డుపై ఓ గుంత కనబడింది. అది చూడగానే అతడికి ఏదోలా అనిపించింది. ఆ గుంత కారణంగా రోడ్డు మీద ప్రయాణించడానికి జనం ఇబ్బంది పడ్డం గుర్తించాడు. ఆ గుంత వల్ల జనం ఇబ్బంది పడ్డం ఇష్టం లేక దాన్ని పూడ్చాలని భావించాడు. అనుకున్నదే తడవుగా గుంతను పూడ్చేశాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు అతడికి నోటీసులు పంపారు. ఆ నోటీసులు చూసి క్లాడియో షాక్ అయ్యాడు.
ఆ నోటీసులో ‘‘ మీరు రోడ్డుపై పడిన గుంతను పూడ్చారు. హైవే కోడ్ ప్రకారం ఈ విధంగా చేయటం నేరం అందుకే మీకు 80 వేల ఫైన్ వేయటం జరుగుతోంది. పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి ప్రమాదకర పనులు చేయటం నేరం. ఆ గుంతను యధాస్థితికి తీసుకురండి’’ అని ఉంది. అధికారులు పంపిన నోటీసుతో అతడి దిమ్మ తిరిగిపోయింది. అధికారులకు డబ్బులు కట్టి.. గుంతను యధాస్థితికి తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.