ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఒకే ఒక్క యూనిక్ టాపిక్ నడుస్తోంది. అదే కరోనా. ఎక్కడో చైనాలో పుట్టి, అన్నీ దేశాల్లో ప్రజలకి ప్రశాంతత లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. ఇన్ని కోట్ల మంది ప్రజలని ఇబ్బంది పెడుతున్న ఈ వైరస్ ఇప్పట్లో పూర్తిగా అదుపులోకి వచ్చే ఛాయలు కనిపించడం లేదు. సో.., మానవాళికి మరిన్ని రోజులు ఈ వైరస్ తో సహజీవనం తప్పదు. ఇలా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఆ లెక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ కి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుకోవాలని వీజ్ మాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. వీరు చేసిన అధ్యయనం ప్రకారం ఒక్క కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్ళగానే వ్యాధి సంక్రమించదు. కనీసం 1000కి పైగా కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్తేనే ఇన్ఫెక్షన్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే వాటికి ఇన్ఫెక్షన్ కలిగించే అంత శక్తి కూడా ఉండదు. ఇక ఒక్కసారి శరీరంలోకి 1000 వరకు వైరస్ ప్రవేశిస్తే.. ఒక్కో వైరస్ తనకు అనుకూలంగా ఉండే కణాల్లోకి చేరి పునరుత్పత్తి మొదలు పెడుతుంది.
అలా ఒక్కో కణంలో కొన్ని వేల వైరస్ లు ఉత్పత్తి అవుతాయి. స్వల్ప లక్షణాలతో కొవిడ్ ఉన్న వారి శరీరంలో వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు వైరస్ ఉండే వీలుందట. అదే.. తీవ్రలక్షణాలతో ఉన్న వారిలో 10 వేల కోట్ల వరకు వైరస్ ఉంటుందట. ఇంకా క్లియర్ గా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే.. ఈ భూమ్మీద ఉండే మనుషుల సంఖ్య కన్నా, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే వ్యక్తిలో ఉండే వైరస్ లు ఎక్కువ. ఇక ఒక కరోనా వైరస్ బరువు ఎంతంటే.. ఒక ఫెమ్టోగ్రామ్. అంటే ఒక గ్రాములో పది కోట్ల కోట్లవ వంతు. ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే ఎన్ని వైరస్ లు అవుతాయో.., అవన్నీ కలిపి ఒక్క గ్రాము బరువు ఉంటాయి అనమాట. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా ఉండే కరోనా రోగుల్లో ఉండే వైరస్ మొత్తాన్ని తూకం వేస్తే అది మొత్తం మూడున్నర కేజీలకు మించదని వీజ్ మాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూశారు కదా..? తిప్పి కొడితే నాలుగు కేజీలు కూడా లేని వైరస్ లోడ్ మానవాళిని ముప్పు తిప్పలు పెడుతుంది అనమాట. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.