ఇషాన్ కిషన్.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఇండియన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై తొలి రెండు వన్డేలు ఓడిపోయామనే బాధ నుంచి కాస్త ఉపశమనాన్ని ఇస్తూ.. డబుల్ సెంచరీ చేసి బంగ్లాను పిచ్చికొట్టుడు కొట్టాడు. ఫోర్లు, సిక్సులతో బంగ్లా బౌలర్లపై శివతాండవం ఆడిన ఇషాన్.. డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సులతో 210 పరుగులు చేసిన ఇషాన్.. రోహిత్ శర్మ 264 రికార్డును బద్దలు కొట్టేలా కనిపించాడు. కానీ.. భారీ సిక్స్‌కు ప్రయత్నించి, లాంగ్‌ఆన్‌లో లిట్టన్ దాస్ సూపర్ క్యాచ్‌తో శాంతించాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ భారత జట్టులో ఏకంగా ముగ్గురి స్థానాలకు ఎసరుపెట్టాడు. ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరు? వారి స్థానాలకు ఏ విధంగా ముప్పు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022తో పాటు బంగ్లాదేశ్‌పై తొలి రెండు వన్డేలో ఓడిపోవడంతో టీమిండియా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. జట్టులో ప్రక్షాళణ చేయాల్సిన అవసరం ఉందనే వాదన గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీతో పాటు మిడిల్డార్‌లో మార్పులపై గట్టి విమర్శలు వినిపించాయి. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ చాలా బలంగా వినిపించింది. కానీ.. బీసీసీఐ వీరిపై నమ్మకంతో బ్యాక్ చేస్తూ వచ్చింది. వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి ఇవ్వగా.. పంత్‌ను ఆడించారు. టీ20, వన్డే సిరీస్‌లలోనూ పంత్ దారుణంగా విఫలం అయ్యాడు. పంత్ బదులు సంజు శాంసన్‌ను జట్టులోకి కీపర్‌గా తీసుకోవాలన్నా.. జట్టులో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాలంటూ పంత్‌ను ఆడించారు.
అలాగే కేఎల్ రాహుల్ దారుణంగా విఫలం అవుతున్నా.. వైస్ కెప్టెన్ హోదాలో, ఇప్పుడు కెప్టెన్ హోదాలో అంతను జట్టులో ఉంటున్నాడు. ఇక మరో సీనియర్ మోస్ట్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కేవలం వన్డేలకే పరిమితం చేశాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. కానీ.. శిఖర్ ధావన్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్ మినహా.. ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ అత్యంత దారుణంగా విఫలం అయ్యాడు. న్యూజిలాండ్‌తో రెండు వన్డేలు, బంగ్లాతో మూడు వన్డేల్లో కలిపి ధావన్ చేసిన పరుగులు కేవలం 44. దీంతో ధావన్ ఫామ్ కోల్పోయాడనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే.. టీ20 వరల్డ్ కప్ సాధించాలనే కలను సెమీస్‌తో చెదిరిపోవడంతో.. ఇప్పుడు టీమిండియా కన్ను వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే.. వన్డే వరల్డ్ కప్ 2023పై పడింది.
ఈ వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా ఏడాది పాటు టీమిండియా ప్రణాళికలు రచించి వరల్డ్ కప్‌కు జట్టును సిద్ధం చేయనుంది. అయితే.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత.. టీమిండియా స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పలు సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్లును ఎంపిక చేయనున్నారు. బంగ్లాదేశ్‌తో నేడు ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్‌తో అతనికి రాబోయే వన్డే సిరీస్‌లోనూ చోట దక్కడం పక్కా. అయితే.. శిఖర్ ధావన్, రిషభ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్‌కు కూడా ఇషాన్ కిషన్ రాణింపు పెద్ద దెబ్బగా మారనుంది. వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మతో పాటు ఎటాకింగ్ క్రికెట్‌తో పాటు లాంగ్ ఇన్నింగ్స్ సైతం ఆడగలడని నిరూపించిన ఇషాన్‌ను ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తే.. ధావన్‌ను సిరీస్‌లకు ఎంపిక చేసినా.. తుది జట్టులో మాత్రం ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశం ఉంది.
అలాగే వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో ఆరో బౌలర్‌ను తీసుకోవాలనో, లేక బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌లో, ఫినిషర్‌నో తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే.. ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చి రిషభ్ పంత్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇషాక్ కిషన్‌ను తీసుకోవడం వల్ల.. ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ రోల్స్ భర్తీ చేయవచు. దీంతో ధావన్, పంత్‌ను పక్కనపెట్టి.. అదనంగా మరో ఆల్‌రౌండర్‌నో, బౌలర్‌నో, ఫినిషర్‌నో తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది. ధావన్‌ను కేవలం ఓపెనింగ్ కోసం, ఫామ్‌లో లేని పంత్‌ను కేవలం కీపింగ్ కోసం తీసుకునే కంటే.. ఇషాన్ కిషన్‌ను తీసుకోవడం ఉత్తమం కదా. పైగా బంగ్లాదేశ్‌పై కొట్టిన డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ కాన్ఫిడెన్స్ కూడా ధావన్, పంత్ కంటే హైగా ఉంటుంది. పైగా పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ లాంటి అగ్రెసివ్ ఓపెనర్ ఉండటం వల్ల మరో ఎండ్‌లో ఉండే రోహిత్ శర్మపై అంతగా ప్రెషర్ పడదు. ఇక కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్ మిడిలార్డర్‌లో ఆడించినా మంచి ఫలితం ఉంటుందని.. క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A knock to remember from Ishan Kishan ✨#BANvIND | https://t.co/SRyQabJ2Sf pic.twitter.com/xh3Es9Jc4X
— ICC (@ICC) December 10, 2022
Fastest ODI Double Centurion…
Youngest ODI Double CenturionCongratulations Ishan Kishan!@ishankishan51 @BCCI #ishankishan pic.twitter.com/IeCl8lQrdd
— Ram Satpute (@RamVSatpute) December 10, 2022