న్యూ ఢిల్లీ- రైల్వే ప్రయాణం అంటే ముందుగా చేయాల్సింది టిక్కెట్ బుకు చేసుకోవడం. రైళ్లో ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే రైళ్లో ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుంది. ఇక మన ప్రయాణానికి టిక్కెట్ బుక్ చెసుకున్నాక, అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం రద్దైతే అప్పుడు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నాక ఎన్ని రోజులకు డబ్బులు తిరిగి వస్తాయా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడా భయం అవసరం లేదు. ఈ మేరకు రైల్వే శాఖ కొత్త పేమెంట్ గేట్ వే ను అందుబాటులోకి తెచ్చింది.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్ సీటీసీ కొత్త పేమెంట్ సర్వీసులను ప్రారంభించింది. కొత్త పేమెంట్ గేట్ వే పేరు ఐపే. ఈ పేమెంట్ ఆప్షన్ ద్వారా ట్రైన్ రిర్వేషన్ టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మీ ప్రయాణం రద్దై, ట్రైన్ టికెట్ ముందుగానే క్యాన్సిల్ చేసుకుంటే, మీ టికెట్ డబ్బులు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అందుకని ఇకపై ట్రైన్ టికెట్ రిఫండ్ డబ్బుల కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం రాదు.
అంతే కాకుండా ట్రైన్ టిక్కెట్ రిజర్వేషన్ సమయంలో మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి టికెట్ బుక్ కాకపోతే, అలాంటి సమయంలోను మీ డబ్బులు నిమిషాల్లో రిఫండ్ అవుతాయి. ఇక మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి, ఫైనల్ చార్ట్ తయారు అయిన తర్వాత మీకు ట్రైన్ లో బెర్త్ కన్ ఫర్మ్ కాకపోతే అలాంటి సమయంలోను మీ టికెట్ ఆటోమేటిక్ గానే క్యాన్సల్ అయిపోతుంది. మీ టిక్కెట్ డబ్బులు వెంటనే మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అందుకని ఇకపై టిక్కెట్ రిఫండ్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పని లేదు.