జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు. ముఖ్యంగా పేదరికంలో పుట్టిన వారికి. పేదవాడు కావాలనుకున్న ప్రతీదాని కోసం ఓ పోరాటం చేయాల్సి వస్తుంది. కలలు పెద్దవి అయ్యేకొద్దీ పోరాటం కొండను ఢీకొన్నట్లుగా ఉంటుంది.
నేటి సమాజంలో విద్యార్థులు ర్యాంకులు రాలేదని.. ఎగ్జామ్ ఫెయిల్ అవుతామేమోనని, ఫెయిల్ అయ్యామని ఆవేదనతో తనువు చాలిస్తున్నారు. చిన్న కష్టంవచ్చినా దానికి పరిష్కార మార్గం ఆలోచించకుండా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. అయితే కొందరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, నష్టాలను ఓర్చుకొని తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని ఉంచుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిన వారే ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ. ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి.. ఐపీఎస్ అధికారి అయ్యాడు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
మనోజ్ శర్మది మధ్యప్రదేశ్, మెరెనా జిల్లాలోని ఓ కుగ్రామం. మనోజ్ ఓ సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టారు. పోలీస్ కావాలని చిన్నప్పటినుంచి కలలు కన్నారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చదువు విషయంలో ఆయనకు అంతా వింతగా ఉండేది. చదువు సరిగా అబ్బలేదు. ఆయన 10వ తరగతి థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియేట్ లో హిందీ సబ్జెక్ట్ తప్ప అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్ అయ్యారు. అయినా వెనక్కు తగ్గలేదు. తర్వాత పట్టు వదలని విక్రమార్కుడిలా చదివి ఫెయిల్ అయిన అన్ని పరీక్షల్లో ఫాస్ అయ్యారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో మగ్గుతూ జీవితం సాగించిన మనోజ్ శర్మ ఎప్పుడూ కుంగిపోలేదు. తన పరాజయాలను సోపానాలుగా చేసుకుని మరింత పట్టుదలతో చదివారు.
తన లక్ష్యం కోసం రాత్రి, పగలు నిర్విరామ కృషి చేశారు. అనుభవాలు నేర్పిన పాఠాలతో యూపీఎస్సీ పరీక్షకు ప్రీపేర్ అయ్యారు. మనసు పెట్టి చదవి పరీక్షల్లో 121వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం మనోజ్ శర్మ ముంబై పోలీస్ శాఖలో అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నా వాళ్లు అనుకున్న వాళ్లను మనోజ్ శర్మ ఎప్పుడూ వదులుకోలేదు. యూపీఎస్సీ పరీక్ష ప్రిపరేషన్ సమయంలో తనకు అన్ని విషయాలలో సాయం చేసి, అండగా నిలబడిన చిన్ననాటి స్నేహితురాలు శ్రద్ధను జీవిత భాగస్వామిని చేసుకున్నారు. మనోజ్ సెక్సెస్ స్టోరీపై “ట్వెల్త్ ఫెయిల్” అనే పుస్తకం కూడా వెలువడింది. మరి, మనోజ్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.