స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి చివరి వారంలో మొదలై మే చివరి దాకా కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 12, 13న రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 1,214 మంది ఆటగాళ్లు పాల్గొననున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ సారి వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
ఇక కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2022 మ్యాచ్‌ల నిర్వహణను కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వేదికలను సైతం ఖరారు చేసినట్లు సమాచారం. అన్నీ సజావుగా సాగి భారత్ లో కరోనా కేసులు అదుపులోకి వస్తే ఏప్రిల్ 2 నుంచి జూన్ 3 మధ్య తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో లీగ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.
ఐపీఎల్ 2022 లీగ్ దశ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో, ప్లే ఆఫ్స్ ను గుజరాత్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. లీగ్ మ్యాచ్ లకు ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, పూణే స్టేడియాలు, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించాలన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది. ఈ విషయమై ఐపీఎల్ పాలక మండలితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
ఇక దేశంలో కరోనా కేసుల నేపధ్యంలో కేవలం రెండు రాష్ట్రాల్లో లీగ్‌ను నిర్వహించడం మంచిదని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా, లేదా అనే విషయం కూడా కొలిక్కి వచ్చినట్లు సదరు అధికారి తెలిపారు. లీగ్ ప్రారంభమయ్యే నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనీసం 25 శాతం సామర్థ్యంతో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.