ప్రస్తుత ప్రపంచ కుబేరుడి సంపద ఎంతంటే.. అతడి కుటుంబ సభ్యలందరి పేరు మీద ఉన్న ఆస్తి కలిపి.. 200 బిలియన్ డాలర్లు. కానీ వీరిని మించిన కుబేరుడు ఒకరు ఉన్నారు. ఆయన సంపద విలువ ఏకంగా 400 బిలియన్ డాలర్లు. ఇంతకు ఎవరా కుబేరుడు అంటే..
ప్రపంచంలో కుబేరుడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిల్‌గేట్స్, ఎలాన్ మస్క్ జెబ్ బెజోస్.. లేదంటే మన అంబానీ, అదానీ. కానీ వీళ్లను మించిన కుబేరుడు మరొకరు ఉన్నారు. ఆయన సంపద ముందు.. నేడు ప్రపంచ కుబేరులుగా చెప్పుకుంటున్న వారు ఎవరు సాటి రారు. ఆయన సంపద ఎంత భారీగా ఉండేదంటే.. ప్రపంచంలో ఉన్న బంగారంలో సగం ఆయన దగ్గరే ఉండేది. అపార సంపదతో అలరారిన ఆ వ్యక్తి ఆ తర్వాత దాన ధర్మాల చేసి అంతా పొగొట్టుకున్నాడు. మరి ఇంతకు ఎవరా వ్యక్తి.. ఏ దేశానికి చెందిన వాడు.. అంత సంపద ఎలా పొగొట్టుకున్నాడో తెలియాలంటే.. ఇది చదవండి.
ఈ భూమ్మీద జన్మించిన వారిలో అత్యంత సంపద కలిగిన వ్యక్తి ఎవరంటే మాన్సా ముసా. ఎవరబ్బా ఇతను.. ఇతగాడి గురించి మేం ఎప్పుడు వినలేదు.. కనీసం వార్తలో కూడా ఎప్పుడు చదవలేదు అనిపిస్తుందా. మీ అనుమానాలు నిజమే. ఎందుకంటే ఆయన ఈ కాలానికి చెందిన వ్యక్తి కాదు. 1200 సంవత్సరం కాలంలో భూమ్మీద నివసించి ఉన్నాడు. ఆయన దగ్గర ఎంత సంపద ఉండేదో ఇప్పటికి కూడా కచ్చితంగా చెప్పలేరు. అనంతమైన సంపద ఆయన సొంతం అని చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పుడు ప్రపంచ కుబేరులుగా ఉన్న మస్క్, అదానీ, అంబానీ, బిల్‌గేట్స్‌ల సంపద మొత్తం కలిపితేఎంత ఉంటుందో.. మాన్సా ఒక్కడి దగ్గర అంత సంపద ఉండేదని చరిత్రకారులు తెలిపారు.
ఇక మాన్సా ముసా టింబుక్తు అనే సామ్రాజ్యానికి చక్రవర్తి. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి దేశంలో ఉండేది. అయితే మాన్సాకు అంత సంపద ఉండటానికి కారణం ఆయన రాజ్యంలో బంగారు నిక్షేపాలు ఎక్కువగా ఉండటమే అంటున్నారు చరిత్రకారులు. ప్రపంచం మొత్తం ఉన్న బంగారంలో సగం మాన్సా దగ్గరే ఉండేదని చెప్పుకుంటారు. మరి అంత సంపద ఎలా పోయింది అంటే మాన్సా దాతృత్వం కారణంగా అంటారు చరిత్రకారులు. అంత సంపద ఉన్న రాజు దాన ధర్మాల కోసం సంపదను ఖర్చు చేసి పేదవాడిగా మిగిలితే.. ఇప్పుడు మాన్సా గతంలో పాలించిన ఆ మాలి పేదదేశంగా మారిపోయింది. ఇక మాన్సా హయాంలో మాలిలో ఏకంగా 1000 కిలోలకుపైగా బంగారం ఉత్పత్తి అయిందని చెప్పుకుంటారు చరిత్రకారులు.
మాన్సా ముసా అసలు పేరు ముసా కీటా I. టింబుక్తు సామ్రాజ్యానికి చక్రవర్తిగా మారిన తర్వాత ఆయన పేరును మాన్సాగా మార్చారు. చారిత్రక కథనాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మౌరిటానియా, సెనెగల్, గాంబియా, గైనియా, బుర్కినా ఫాసో, మాలి, నైగర్, చాడ్, నైజీరియా ఇలా ఈ దేశాలు మాన్సా రాజ్యంలో భాగంగా ఉండేవి. 1312 సంవత్సరంలో మాలి రాజ్యానికి చక్రవర్తిగా అవతరించాడు మాన్సా ముసా. ఆయన తన 25 ఏళ్ల పాలనలో తన రాజ్యంలో ఎన్నో మసీదుల్ని నిర్మించాడు. అవన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
మాన్సా ముసా 1280లో జన్మించాడు. అతడి కన్నా ముందు మాన్సా పెద్ద సోదరుడు మాన్సా అబు బాకర్ 1312 వరకు మాలిని పాలించారు. తర్వాత ఆ రాజ్యం మాన్సా ముసా చేతుల్లోకి వెళ్లింది. మాన్సా హయాంలో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి మంచి డిమాండ్ ఉండేది. ఇక ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో సగం మాన్సా దగ్గరే ఉండేది. చరిత్రకారుల ప్రకారం.. ఆ రోజుల్లోనే మాన్సా దగ్గర సుమారు 400 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఉండేదని చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.30 లక్షల కోట్లకుపైనే కావడం విశేషం. ప్రస్తుత ప్రపంచ కుబేరుడుగా ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ కుటుంబ సంపద మొత్తం కలిపినా కూడా 200 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. మాన్సా సంపద ఇందుకు రెట్టింపు.
మాన్సా ముసా తన జీవితంలో చేపట్టిన మక్కా యాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆ సమయంలో మాన్సా తన వెంట ఏకంగా 60 వేల మంది పరివారాన్ని వెంటబెట్టుకొని మక్కా వెళ్లాడు. ఇందులో 12 వేల మంది తన వ్యక్తిగత అనుచరులు. ఈ యాత్రంలో 500 మంది పట్టు వస్త్రాలు ధరించి.. చేతిలో బంగారు కడ్డీలు పట్టుకుని మాన్సా గుర్రం వెంబడి నడిచారు. ఈ మక్కా యాత్రలో 80 ఒంటెలు కూడా ఉన్నాయట. ఆ ఒంటెలు కా 130 కిలోలకుపైగా బంగారాన్ని మోసుకుంటూ ముసా వెంట నడిచాయట. అయితే ఇంతటి అపార సంపద ఉన్న మాన్సా దానధర్మాల కారణంగా సంపదను మొత్తం కోల్పోయాడని చరిత్ర చెబుతుంది.