స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మొత్తానికి అనుకున్నది సాధించారు. డీల్ కి ఒక రోజు ముందుగానే ట్విట్టర్ ను కొనుగోలు చేసి తన సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ సహా పలు టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించారు. తొలగించిన అనంతరం ‘పక్షికి విముక్తి లభించింది’ అంటూ ఒక ట్వీట్ చేశారు. దీంతో భారతీయులపై ఎలాన్ మస్క్ కి ఎందుకింత కోపం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ కి భారతదేశం అంటే కోపం ఉందా? భారతదేశంపై మస్క్ పగ తీర్చుకున్నారా? అసలు భారతీయులని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు ఎవరీ విజయ గద్దె పరాగ్ అగర్వాల్?
విజయ గద్దె భారత సంతతికి చెందిన అమెరికా మహిళ. ఇన్నాళ్లు ట్విట్టర్ పాలసీ, లీగల్, ట్రస్ట్ హెడ్ గా పని చేశారు. 1974లో హైదరాబాద్ లో జన్మించారు విజయ. మూడేళ్ళ వయసప్పుడు ఈమె కుటుంబం అమెరికాకి వలస వెళ్ళింది. అక్కడే ఈమె తన చదువును పూర్తి చేశారు. కార్నెల్, న్యూయార్క్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొన్నాళ్ళు న్యాయవాదిగా సాగిన విజయ.. 2011లో ట్విట్టర్ కంపెనీలో చేరారు. లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్ గా ఈమె అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ద్వేషపూరిత ప్రకటనలు, ద్వేషపూరిత ట్వీట్లు, వేధింపులతో కూడిన ట్వీట్లు, తప్పుడు సమాచారం వంటి వాటిని నియంత్రించడంలో కీలక పాత్ర వహించారు.
పరాగ్ అగర్వాల్ 1984లో రాజస్థాన్ లో జన్మించారు. ఈయన ముంబైలో చదువుకున్నారు. 2005లో అమెరికా వెళ్లి.. అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. 2011లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప్రయాణం మొదలుపెట్టారు. ఒక్కో అడుగు ఎక్కుతూ.. 2017లో ట్విట్టర్ సీఈఓగా ఎదిగారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై పని చేశారు. అయితే ట్విట్టర్ లో అందరికంటే ఎక్కువగా 9.2 శాతం వాటా కలిగి ఉన్న మస్క్.. ట్విట్టర్ ను కొనాలనుకున్నప్పుడు ఈ పరాగ్ అగర్వాల్.. ట్విట్టర్ నకిలీ ఖాతాలు, స్పామ్ అకౌంట్లకు సంబంధించి తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని మస్క్ తప్పుబట్టారు. దీంతో ట్విట్టర్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది.
విచారణ ఎదుర్కునే ఒక రోజు ముందే మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్లు (3.37 లక్షల కోట్లు) చెల్లించి మరీ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం సినిమా క్లైమాక్స్ ను తలపించేలా ఉందని కామెంట్లు వస్తున్నాయి. అయితే భారతీయుల్ని టార్గెట్ చేయడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మస్క్ భారత్ పై పగ తీర్చుకునే ప్రయత్నంలో భాగంగానే భారతీయ ఉద్యోగుల్ని ట్విట్టర్ సంస్థ నుండి తొలగించారా? లేక డొనాల్డ్ ట్రంప్ విషయంలో జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఇలా చేసారా? అనే చర్చ నడుస్తోంది.
గతంలో డొనాల్డ్ ట్రంప్ విషయంలో విజయ గద్దె ప్రవర్తించిన తీరుపై మస్క్ మండిపడ్డారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే ట్వీట్లు.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, నేరాలను పురికొల్పేలా ఉన్నాయని జనవరి 2021లో ఆయనను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా తొలగించారు. అయితే అది సరైన నిర్ణయం కాదని అప్పట్లో మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మస్క్ అభిప్రాయానికి విజయ గద్దె సహా మిగతా టాప్ ట్విట్టర్ ఉద్యోగులు గౌరవం ఇవ్వలేదన్న కోపం మస్క్ కి ఉంది. అందుకే ఎలాన్ మాస్క్.. వీరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరో కారణం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో మస్క్ తన టెస్లా కార్లను డైరెక్ట్ గా భారతీయ మార్కెట్లో విక్రయించేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ సమయంలో టెస్లా షోరూముల కోసం స్థలాలను కూడా పరిశీలించారు. అయితే చైనాలో తయారైన టెస్లా కార్లను భారత్ కి దిగుమతి చేసి విక్రయిస్తామని, దిగుమతి పన్నులను తగ్గించాలని మస్క్ ప్రతిపాదన తీసుకొచ్చారు. మస్క్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ముందు మా టెస్లా కార్లను ఇండియాలో విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తే తర్వాత ఇక్కడే తయారీ యూనిట్ ను ప్రారంభిస్తామని మస్క్ తన అభిప్రాయాన్ని చెప్పారు. టెస్లా కార్లు భారత్ లో తయారుచేసేలా అయితే అనుమతిస్తాం, ఎక్కడో తయారుచేసిన కార్లను ఇక్కడ విక్రయిస్తామంటే ఒప్పుకోము అని కేంద్రం బదులిచ్చింది. దీంతో ఎలాన్ మస్క్ కి భారత్ లో చేదు అనుభవం ఎదురైనట్టు అయ్యింది.
కట్ చేస్తే మరో విషయంలో మరో చేదు అనుభవం ఎదురైంది. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవల్ని వరల్డ్ వైడ్ గా అందిస్తున్నారు. ఆసియాలో కూడా తన బిజినెస్ ని విస్తరింపజేయాలని మస్క్ అభిప్రాయపడ్డారు. అది భారత్ తోనే సాధ్యం అని నమ్మిన మస్క్.. ఆ దిశగా అడుగులు వేశారు. భారత్ లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం బుకింగ్స్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అయితే లైసెన్స్ లేకుండా బుకింగ్స్ ఏంటని కేంద్రం చురకలు అంటించింది. దీంతో భారత్ లో పాగా వేయాలన్న స్టార్ లింక్ ప్రయత్నాలు నిలిచిపోవడంతో పాటు.. అప్పటి వరకూ కనెక్షన్ల కోసం తీసుకున్న అడ్వాన్స్ డబ్బులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.
ఇదొక చేదు అవమానం అనుకుంటే.. స్టార్ లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేయడం మరో అవమానంగా ఫీలయ్యారు మస్క్. కేంద్రమే ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే తన కంపెనీలో కీలకమైన పదవికి భారతీయుడు రాజీనామా చేయడమా? అని మస్క్ ఈగో హర్ట్ అయి ఉంటుందని, అందుకే ఇలా భారతీయులను ట్విట్టర్ నుండి తొలగించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన కార్లను ఇండియాలో విక్రయించడానికి అనుమతి ఇవ్వకపోవడం, స్టార్ లింక్ విషయంలో అవమానం ఎదురవ్వడం, డొనాల్డ్ ట్రంప్ విషయంలో భారతీయ సంతతికి చెందిన ఉద్యోగులు ప్రవర్తించిన తీరు నచ్చకపోవడం వంటి కారణాల వల్ల మస్క్ ఇలా చేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
🎶 let the good times roll 🎶
— Elon Musk (@elonmusk) October 28, 2022