మమ్మల్ని గెలిపిస్తే.. మేము అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని ఎన్నికల్లో నిలిచే నేతలు హామీలను, వాగ్దానాలతో ఊదరగొట్టేస్తుంటారు. ఇవి చాలవన్నట్లు మ్యానిఫెస్టో రూపంలో కూడా పొందుపరుస్తారు. ఇంటింటికీ తిరిగి ఇదే ప్రచారం చేస్తారు. ఎన్నికలు ముగిసిపోయాక.. వారే కనిపించరూ. ఇక హామీల సంగతి చెప్పనక్కర్లేదు.
మన దేశంలో ప్రస్తుతం ఎన్నికల కాలం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మరికొన్ని రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. హామీల పర్వాలు, ప్రచారాల హోరు, నేతల బేజారు కామన్‌గా కనిపిస్తుంటాయి. ప్రచారాల సమయంలో మమ్మల్ని గెలిపించండని, మేము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవీ చేస్తాం అంటూ హామీల వర్షం కురిపిస్తారు ఎన్నికల బరిలో నిలిచే నేతలు. మరీ గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారా అంటే.. నేల చూపులు చూసుకోవాల్సిందే. ఓట్లను అడిగే సమయంలో కనిపించే నేతలు.. తమకు సమస్య వచ్చిందీ మహా ప్రభో అని ప్రజలు మొరపెట్టుకున్నా కనిపించరూ. ఇక హామీలు, వాగ్దానాల మాట చెల్లని చెక్కుపై సంతకం లాంటివే. మళ్లీ ఎన్నికల సమయంలోనే వారి ముఖాలు కనిపించేదీ. కానీ ఇలాంటి పప్పులేమీ ఉడకవు ఆ ఊరిలో.
వాగ్థానాలు ఇచ్చాక ఆ ఊరిలో కచ్చితంగా వాటిని నెరవేర్చాల్సిందే. లేదంటే నేతల్ని ప్రజలు శిక్షిస్తారు. ఇంతకు అలాంటి ఊరు ఎక్కడ ఉందనుకుంటున్నారా.. ఇటలీలోని ఓ చిన్న పట్టణం ట్రెంటో. ఇక్కడ నేతలు హామీలు నెరవేర్చకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలే అక్కడ వారిని బహిరంగంగా శిక్షిస్తారు. ఈ వింత ఆచారాన్ని ప్రతి ఏడాది అనుసరిస్తున్నారు అక్కడి ప్రజలు. ఎన్నుకున్న నేత హామీలను నెరవేర్చనట్లయితే అతడిని ఓ బోనులో వేసి.. నదిలో ముంచుతారు. ఓ సెకను పాటు అలా చేస్తారు. తప్పయిందీ అని ఆ నేత తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వారు ఇలా శిక్షిస్తారు. ఈ ఆచారాన్ని ‘టోంకా’ అని పిలుస్తారు. ఈ వింత ఆచారం ద్వారా తమ తప్పులు తెలుసుకుని, మరోసారి అవి రిపీట్ చేయకుండా చూసేందుకు అలా చేస్తామని స్థానికులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం జూన్ రెండవ వారంలో పట్టణంలో జరుపుకునే విజిలియన్ వేడుకల్లో భాగంగా ఇలా చేస్తారు. ఈ వేడుకల్లో బోనులో ఉంచి, నీటిలో ముంచడం ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి. దీనిని కోర్టు ఆఫ్ పెనిటెన్స్ అని పిలుస్తారు. రాజకీయ నేతలు, ప్రసిద్ధ వ్యక్తులను ఇలా శిక్షిస్తారు అక్కడి ప్రజలు. టోంకా సంప్రదాయం ప్రకారం జూన్ 26కు ముందు వచ్చే ఆదివారం నాడు నిర్వహిస్తారు. 2022లో జూన్ 19న దీన్ని నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 25న ఈ కార్యక్రమం చేపట్టే అవకాశాలున్నాయి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన నేతలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకుంటున్న వారిని ఇలా శిక్షించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.