మాతృత్వంలో ఉంది ఆడజన్మ సార్థకం, అమ్మా అని పిలిపించుకొనుటయే స్త్రీ మూర్తికి గౌరవం అంటూ ఓ కవి అమ్మతనం గురించి ఎంతో గొప్పగా పొగిడారు. అసలు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సృష్టిలో కల్తీ లేనిది అమ్మ ప్రేమే అని అంటుంటారు. బిడ్డల పట్ల తల్లి ప్రేమ అనంతం. అవసరమైతే తన ప్రాణాలు అడ్డుపెట్టయినా బిడ్డలను రక్షించుకోగలదు.
తాజాగా వెనిజులాకు చెందిన ఓ తల్లి… తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. మనసును కలిచివేస్తున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల మేరీలీ చాకోన్ తన కుటుంబంతో ఓడలో సెప్టెంబర్ 3న కరేబీయన్ దీవుల్లో విహారానికి వెళ్లారు. మేరీలీ చాకోన్‌తో పాటు ఆమె భర్త, 6 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె, వారి ఇంటి పనులు చూసుకుంటున్న మరో మహిళ వెరోనికా మార్టినెజ్ ఉన్నారు. సాఫీగా సాగుతున్న వారి ప్రయాణంలో పెను తుఫాన్ కలకలం సృష్టించింది. భారీ అలలు ఓడను ముంచెత్తడంతో.. ఓడ రెండుగా చీలిపోయింది. కొంత భాగం నీటిలో మునగగా… మరికొంత భాగం పైకి తేలింది. ఈ ప్రమాదంలో మెరిలీ చాకొన్ భర్తతో పాటు ఓడలో ప్రయాణిస్తున్న మరికొందరు గల్లంతయ్యారు.
మేరి చాకొన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి లైఫ్ బోట్ సాయంతో ఓడ నుంచి బయటపడి సాయం కోసం ఎదురుచూడసాగింది. మేరీలీ చాకోన్ భర్త నీటిలో మునిగిపోయాడు. మేరీలీ చాకోన్, ఆమె పిల్లలు, వెరోనికా మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ నడి సముద్రంలో వారికి సాయం చేసేవారెవరు. అలా ఆ ముగ్గురు నాలుగు రోజుల పాటు తిండి.. తిప్పలు లేక అదే లైఫ్ బోట్‌లో నిస్సహాయంగా ఉండిపోయారు. ఓ వైపు విపరీతంమైన వేడి.. అదే సమయంలో నీళ్లు, ఆహారం లేకపోవడంతో అప్పటికే శరీరాలు డీహైడ్రేషన్‌కు గురయ్యాయి. ఇక, పిల్లల సంగతి చూసి తల్లి మేరీలీ చలించిపోయింది. వారిని బతికించడానికి ఏదో ఒక రకంగా ఆహారం ఇవ్వాలని చూసింది. తన మూత్రాన్ని తానే తాగి.. పిల్లల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. అయితే శరీరం పూర్తిగా డీహైడ్రేషన్ కావడంతో ఆమె మరణించింది.
ఇక, ఓర్చిలా ద్వీపంలో ఓడ భాగాలు తేలుతున్నట్టుగా వెనిజులా అధికారులు సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునే నాలుగు గంటల ముందే మేరీలీ మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న మేరీలీ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, బోట్ ప్రమాదంలో మరో ఐదుగురు గల్లంతయ్యారని, వారంతా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అందులో మేరీలీ భర్త కూడా ఉన్నాడు. తన బిడ్డల కోసం మేరీలీ చేసిన త్యాగానికి అందరూ నివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.