పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ డిజైనర్ ఓ వెరైటీ కేకును తయారు చేసింది. సృజనాత్మకత ఉంటే దేన్నైనా కేకులా మార్చవచ్చని నిరూపిస్తూ తన దుస్తులను పోలి ఉన్న కేకులను రెడీ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ కేకు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ది అమెరికన్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ డెజర్ట్ డిజైనర్ లిజ్ జాయ్ ఈ అద్భుతమైన కేకు తయారు చేసి నెటిజన్లను ఫిదా చేస్తోంది. వృత్తి రీత్యా ఒక ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున లిజ్ జాయ్వా ర్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి ఎన్నో హాలీవుడ్ స్టూడియోలతో కలిసి పనిచేసింది. తన అనుభవాన్నంతా కలబోసి ఈ అద్భుత సృష్టిని రూపొందించింది.
ఆమె తయారు చేసిన కేకులో ప్యాంట్, స్పఘెట్టి టాప్, గోధుమ రంగులోని కోటు వంటివి మనం చూడవచ్చు. లీజ్ ఎల్లప్పుడూ ఇటువంటి కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఆమె జీవితంలో ప్రయోగాలకు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే, మనుషులు ధరించే దుస్తులు వారి వ్యక్తిత్వాన్ని చెప్పడంలో ముందుటాయని ఆమె బలంగా నమ్ముతుంది. కాగా, ఆమె తాజా సృష్టిని గత వారం ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా అది ఇప్పటివరకు 3 వేల లైక్‌లను సంపాదించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు.