నవమోసాలు బిడ్డను కడుపున మోసి కనడం ఆడవారి విధి. అది ప్రకృతి సహజంగా వచ్చింది. అయితే బిడ్డలు వద్దనుకున్నప్పుడు కూడా ఆడవారే మాత్రలు వాడటం, ఆపరేషన్‌లు చేయించుకోవడం చేస్తుంటారు. అయితే మగవారి కోసం కూడా ఇలాంటి మాత్రలు తీసుకురావాలని ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆ దిశగా ఓ ముందడుగు పడింది. ఆ వివరాలు..
నవ మోసాలు మోసి బిడ్డను కనడం ఆడవారి వంతు. అలానే బిడ్డలు వద్దనుకున్నప్పుడు, బిడ్డలకు మధ్య గ్యాప్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఆడ వారే గర్భ నిరోధక మాత్రలు వాడతారు లేదా సంతానం కలగకుండా సర్జరీలు చేయించుకుంటారు. అప్పటికే బిడ్డను కనే సమయంలో కోత, తరువాత వద్దనుకున్నప్పుడు కోత.. ఇలా సర్జరీల పేరుతో ఆడవారు ఎంత శక్తిహీనులవుతారో అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఇక బిడ్డలు వద్దనుకున్నప్పుడు మాత్రలు వాడుతుంటారు. అయితే కొందరు ఆడవాళ్లల్లో ఈ మాత్రలు అనేక దుష్ప్రభావాలు చూపుతుంటాయి. దీర్ఘకాలం మాత్రలు వాడటం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఇప్పటి వరకు ఆడవారు వినియోగించే గర్భ నిరోధక మాత్రలు.. అండాల తయారీని అడ్డుకుంటాయి. మరి ఆడవాళ్లకు మాత్రమే ఇలా మాత్రలు వాడటం ఎందుకు.. మగవాళ్ల కోసం కూడా టాబ్లెట్లు తీసుకురావవచ్చు కదా అన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఆ దిశగా కొంత మేర విజయం సాధించారు శాస్త్రవేత్తలు.
మగవాళ్ల కోసం సంతాన నిరోధక మాత్రలు అభివృద్ధి చేసే క్రమంలో శాస్త్రవేత్తలు కొంత మేర విజయం సాధించారు. ఎప్పటి నుంచో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మగవాళ్ల సంతాన నిరోధక మాత్రకు సంబంధించి ప్రీ-క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇవి పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే.. ఇక భవిష్యత్తులో ఆడవారి మాదిరిగానే.. పురుషులకూ సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి వస్తాయి. మగవారిలో సంతాన నిరోధన కోసం తయారు చేసిన మాత్రలను ఎలుకలపై ప్రయోగించి విజయం సాధించారు. త్వరలోనే మగవారిపై కూడా ఈ మాత్రలను ప్రయోగించి సక్సెస్ అయితే.. ఆడవారికి గర్భ నిరోధక మాత్రలు ఉన్నట్లుగానే.. ఇక మగవారి కోసం.. సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి వస్తాయి.
అమెరికా, న్యూయార్క్‌కు చెందిన వెయిల్ కార్నెల్ మెడికల్ స్కూల్ ఈ పరిశోధన చేసింది. ఈ రిసెర్చ్‌కి సంబంధించిన నివేదికను ఫిబ్రవరి 14న నేచుర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితం చేసింది. కాగా, ఈ మాత్రను శృంగారం చేయడానికి గంట ముందు తీసుకుంటే.. మాత్ర తీసుకున్న 3 గంటలకు ప్రభావం మొదలై 24 గంటల వరకు పనిచేస్తుందని పరిశోధన వివరాల్లో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. కాగా, సంతాన నిరోధక మాత్ర మగవారి శరీరంలో ఏ హార్మోన్‌నూ నశింపచేయదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సాధారణంగా మగవారిలో ఉండే సాల్యూబుల్ అడెనైల్ సైక్లేస్ అనే ప్రొటీన్.. వీర్య కణాలు వేగంగా గర్భాశయం వైపు ఈదేందుకు సాయపడుతుంది. అయితే, వెయిల్ కార్నెల్ మెడికల్ స్కూల్ అభివృద్ధి చేస్తోన్న ఈ మాత్ర.. సాల్యూబుల్ అడెనైల్ సైక్లేస్ ప్రొటీన్ చేసే ప్రక్రియను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ మాత్రను సింగిల్ డోసు ఇవ్వడం ద్వారా ఎలుకల్లో తాత్కాలిక సంతాన లేమి (టెంపరరీ ఇన్‌ఫర్టైల్) స్థితిని కలిగించడం సాధ్యమైందని పరిశోధన నివేదిక వెల్లడించింది.
రానున్న మూడేళ్లల్లో మనుషులపై ఈ మాత్ర తొలి దశ ట్రయల్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు పరిశోధకులు. ప్రక్రియ తుది దశకు వచ్చి.. పూర్తి స్థాయిలో విజయవంతమైన మాత్రను ఉత్పత్తి చేసేందుకు కనీసం ఎనిమిదేళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అవాంఛిత గర్భాల శాతం పెరుగుతోందని తెలిపారు. ‘‘పురుషుల్లో సెకనుకు వెయ్యి వీర్య కణాలను ఉత్పత్తి అవుతాయి. అంవాఛిత గర్భాన్ని నిరోధించాలంటే.. మిలియన్ల సంఖ్యలో ఉండే వీర్య కణాలను నిరోధించేందుకు సరైన మార్గాలను అన్వేషించాలి. ఈ నేపథ్యంలోనే పురుషుల కోసం సంతాన నిరోధక మాత్రలు తయారీ చాలా కష్టంగా ఉంది’’ అని పరిశోధన పత్రాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. పురుషుల కోసం సంతాన నిరోధక మాత్రలు రావడం అవసరమని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.