వేసవి కాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం. మన దేశంలో వడదెబ్బ కారణంగా ఏటా చాలా మంది మృతి చెందుతారు. కానీ వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఉండదు. కానీ తాజాగా ఓ చోట వడదెబ్బ కారణంగా మృతి చెందిన బాధితుడి కుటుంబానికి భారీ పరిహారం ఇచ్చారు. ఆ వివరాలు..
వేసవి కాలం ప్రారంభం అయ్యింది. గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో.. వాతావరణం కాస్త చల్లగా ఉంది. కానీ నిన్నటి నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం మొదలవుతుంది. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు. కానీ అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. మరి పోను పోను ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పలేం. ఇక వేసవి కాలం అంటే వడదెబ్బ తగలడం సహజం. వృద్ధులు ఆ ధాటికి తట్టుకోలేక మృతి చెందుతారు. మన దేశంలో అయితే వడదెబ్బ కారణంగా చనిపోతే సహజ మరణం కిందకే వస్తుంది. అయ్యో పాపం అనుకోవడం తప్ప.. మరేం చేయలేం. వడదెబ్బ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వాలు ఏమన్నా సాయం చేస్తాయా అంటే.. సహజ మరణం కిందకు వస్తుంది.. డబ్బులు ఎందుకు ఇస్తుంది అని అంటాం. కానీ ఓ చోట మాత్ర వడదెబ్బ కారణంగా మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఏకంగా 110 కోట్ల రూపాయలు పరిహారం అందజేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన అమెరికా, కెంటకీలో చోటు చేసుకుంది. వడదెబ్బతో ఓ విద్యార్థి మృతి చెందాడు. అతడి కుటుంబానికి భారీ పరిహారం చెల్లించేందుకు యూనివర్శిటీ ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్‌కు సంబంధించి హీట్ ఇల్‌నెస్ ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహించారు. గ్రాంట్ బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు.. ఈ ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు. అయితే శిక్షణ అనంతరం అతడు అలసిపోయి అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో గ్రాంట్‌కు విపరీతంగా దాహం వేయడంతో.. తాగడానికి తనకు మంచి నీళ్లు ఇవ్వమని అక్కడున్నవారిని అభ్యర్థించాడు.
అయితే, కోచ్‌లు అందుకు నిరాకరించడమే కాక.. శిక్షణలో భాగం అంటూ ఇంకెవరూ గ్రాంట్‌కు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన గ్రాంట్ సొమ్మసిల్లి పడిపోయాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ గ్రాంట్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి పరిస్థితి విషమిస్తున్నా సరే.. కోచ్‌లు పట్టించుకోకుండా అతడి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారని.. అందువల్లే తమ కొడుకు చనిపోయాడని గ్రాంట్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడు ట్రైనింగ్‌లో తీవ్రంగా అలసిపోయి.. తాగడానికి నీళ్లు అడిగితే కోచ్‌లు ఇవ్వలేదు సరి కదా.. మిగతా వాళ్లను కూడా వాటర్ ఇవ్వకుండా అడ్డుకున్నారని వాపోయారు.
తమ కుమారుడి మరణానికి యూనివర్శిటీ యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ.. తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని గ్రాంట్ కుటుంబసభ్యులు కోర్టును కోరారు. వారి వాదనాలు విన్న న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు పరిహారం కింద చెల్లించాలని ఆదేశించింది. యూనివర్శిటీ యాజమాన్యం.. అందుకు అంగీకరించింది. ‘‘అధిక ఎండలు, వడదెబ్బ సంబంధిత గాయాలపై అవగాహన కలిగించే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రాంట్ అంగీకరించాడు. కానీ దురదృష్టవశాత్తూ గ్రాంట్ వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. అతడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. ఈ కేసు న్యాయపరంగా పరిష్కారం కావడంతో గ్రాంట్ ఆత్మకు శాంతి, స్వస్థత చేకూరుతుందని ఆశిస్తున్నాం’’ అని యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రోజు సెషన్‌లో పాల్గొన్న ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేసినట్లు యూనివర్సిటీ ఈ సందర్భంగా వెల్లడించింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.