అమెరికా అంటే చాలా మందికి ఒక కలల దేశం. అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చెందడంతో అక్కడికి వెళ్లాలని కోరుకునే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే పరిస్థితులు మారాయి. యూఎస్ వెళ్లాలంటే అందరూ వణికిపోతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా పోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా చదువుకుంటున్న యువత యూఎస్‌కు వెళ్లి సెటిల్ అవ్వాలని కోరుకుంటుంటారు. మంచి విద్య, వైద్యాన్ని అందిస్తూనే లక్షలు సంపాదించే ఉపాధి అవకాశాలు ఉండటంతో అమెరికాకు వెళ్లాలనేది యూత్ కలగా మారిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. అగ్రరాజ్యానికి వెళ్లాలంటే చాలా మంది భయపడుతున్నారు. అక్కడ గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కాల్పుల ఘటనలు ఎక్కువవుతున్నాయి. దొంగల చేతుల్లో, జాతి వివక్ష కారణంగా జరిగిన దాడుల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
ఇటీవల అమెరికాలో ఒక ఏపీ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) ఎంఎస్ చదివేందుకు యూఎస్‌కు వెళ్లాడు. పార్ట్ టైమ్‌గా పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయేశ్‌ను ఒక దుండగుడు కాల్చి చంపాడు. పెట్రోల్ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్న దుండగుడ్ని అడ్డుకున్నందుకు సాయేశ్పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఇలాంటి ఘటనలు యూఎస్‌లో ఈమధ్య ఎక్కువయ్యాయి. అక్కడ ఎవ్వరి ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. తుపాకుల వాడకంపై కఠిన చట్టాలు లేకపోవడంతో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. యూఎస్‌లో తుపాకుల వాడకం 80 శాతానికి పైగా ఉందని సమాచారం. గన్ కల్చర్ వల్ల అక్కడ రోజూ 53 మంది చనిపోతున్నారని నిపుణులు అంటున్నారు.
గన్ కల్చర్, జాత్యహంకార దాడులు పెరిగిపోవడంతో అమెరికా సేఫ్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యూఎస్ వెళ్లేందుకు చాలా మంది భయపడుతున్నారు. తుపాకుల వాడకానికి పర్మిషన్స్ ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత మంది అమాయకుల ప్రాణాలు పోతున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కొందరు సీరియస్ అవుతున్నారు. సర్కారు ఇప్పటికైనా మేల్కొని తుపాకుల వాడకంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, యూఎస్‌లో చాలా మంది పౌరుల దగ్గర గన్స్ ఉంటాయనేది తెలిసిందే. అక్కడ ప్రతి పది మందిలో ముగ్గురి దగ్గర సొంత తుపాకీ ఉంటుంది. వీటికి అక్కడి రాష్ట్రాలు లేదా స్థానిక ప్రభుత్వాలు లైసెన్స్ ఇస్తాయి. అందుకే గన్ ఓనర్షిప్లో యూఎస్ 120.5 శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.