స్మగ్లింగ్ ముఠా.. తనిఖీ బృందాల కళ్లు గప్పి విలువైన వాటిని సరిహద్దులు దాటించడమే వీరి పని. వీరు.. పాములు, కప్పలు, తాబేళ్లు, బల్లులు, మొసళ్లు వంటి వాటినే కాదు.. ఏ జంతువును వదిలేలా లేరు. చట్టాలకు తూట్లు పొడుస్తూ విలువైన వాటినే కాదు.. అరుదైన జంతు జాతులను కూడా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా సరిహద్దులు దాటిస్తూ నిత్యం పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి వేరేలా తీసుకెళ్తే అధికారులకు చిక్కుతా అనుకున్నాడో ఏమో వేసుకున్న బట్టల్లోనే పాములు బల్లులు దాచుకొని పోలీసుల కంట పడ్డాడు.
కాలిఫోర్నియా, మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్‌సిడ్రో సరిహద్దు వద్దకు అమన్ అనే వ్యక్తి ట్రక్కుతో వచ్చాడు. అయితే తనిఖీల్లో భాగంగా అధికారులు అతన్ని బయటకు పిలిచారు. ఈ క్రమంలో అతని ప్రవర్తన వింతగా ఉండేసరికి అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేసేసరికి అసలు బాగోతం బయటపడింది. ఒంటి నిండా దుస్తుల్లో.. ఏకంగా 52 పాములు,బల్లులు బయటపడటంతో బోర్డర్ అధికారులు షాక్‌కి గురయ్యారు. అమన్ ఏకంగా 52 సరీసృపాలను చిన్న చిన్న సంచుల్లో దాచి.. వాటిని వేసుకున్న జాకెట్, ప్యాంటు పాకెట్లు, ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ వాటిని దాచిపెట్టుకుని సరిహద్దు దాటేందుకు ప్రయత్నించబోయి.. పట్టుబడ్డాడు. అతను తరలిస్తున్న వాటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి