ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇరు దేశాల ప్రెసిడెంట్స్ మీద పడింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ రష్యాకి వార్నింగ్ ఇస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఏమైనా తక్కువ తిన్నాడా? ప్రపంచ దేశాలు సైతం షాక్ అయ్యే రీతిలో పుతిన్ కి సమాధానం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు మారు మ్రోగిపోతోంది. మరి.. ఈ జెలెన్ స్కీ నేపథ్యం ఏంటి? ఎక్కడ నుండి వచ్చాడు? ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలా అయ్యాడు? ఇతని మొండి ధైర్యానికి కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జెలెన్ స్కీ పూర్తి పేరు వోలోడిమిర్ ఒలెక్సాండ్రోవిచ్ జెలెన్ స్కీ. ఈయన 1978 లో జనవరి 25న అప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ లోని క్రివ్యిరిహ్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన తండ్రి ఒలెక్సాండర్ సెమెనోవిచ్ జెలన్ స్కీ, తల్లి రైమా జెలెన్ స్కీ. జెలెన్ స్కీ తండ్రి మైనింగ్ సైంటిస్ట్ గా, క్రివ్యిరిహ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తుండగా, తల్లి ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జెలెన్ స్కీ తాత గారు, రెండో ప్రపంచయుద్ధ సమయంలో రెడ్ ఆర్మీలో పనిచేశారు. జెలెన్ స్కీ తన స్కూలింగ్ ని పుట్టిన ప్రాంతమైన క్రివ్యిరిహ్ లో పూర్తిచేశాడు. 16వ ఏట ఇంగ్లీష్ టెస్ట్ లో ఉత్తీర్ణుడు కావడంతో ఇజ్రాయెల్ లో డిగ్రీ చదివే అవకాశం వచ్చింది. అయితే జెలెన్ స్కీ తండ్రి క్రివ్యి ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ కావడంతో, తన కొడుకు అందులోనే చదవాలని పట్టుపట్టారు. దీంతో చేసేదేమీ లేక జెలెన్ స్కీ తన క్రివ్యిరిహ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు పూర్తి చేసి లాయర్ పట్టా అందుకున్నారు. కానీ లాయర్ గా మాత్రం పని చేయలేదు.
డిగ్రీ చదువుతున్నప్పుడే జెలెన్ స్కీ నటన పట్ల ఆకర్షితుడయ్యారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఎంటరయ్యారు. 17 వ ఏట కేవీఎన్ అనే కామెడీ ట్రూప్ లో జాయిన్ అయ్యి, అనతి కాలంలోనే కమెడియన్ గా పేరు తెచ్చుకుని తానే సొంతంగా క్వార్టల్ 95 అనే కామెడీ ట్రూప్ ని క్రియేట్ చేసే స్థాయికి ఎదిగారు. చాలా ఏళ్ళ పాటు ప్రజలకి వినోదాన్ని పంచిన జెలెన్ స్కీకి టీవీ షోలు, సినిమాలలో చేసే అవకాశాలు వచ్చాయి. 2008 లో లవ్ ఇన్ ది బిగ్ సిటీ మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన జెలెన్ స్కీ, లవ్ ఇన్ ది బిగ్ సిటీ 2, లవ్ ఇన్ ది బిగ్ సిటీ 3, ఆఫీస్ రొమాన్స్ అవర్ టైమ్ వంటి రొమాంటిక్ కామెడీ మూవీస్ లో నటించారు. ఆ తర్వాత జెలెన్ స్కీ, 8 ఫస్ట్ డేట్స్- దాని సీక్వెల్స్ లో హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. అయితే 2014 లో ఉక్రెయిన్ లో ఉంటున్న రష్యన్ ఆర్టిస్టులని బ్యాన్ చేయాలని ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రష్యన్ ఆర్టిస్టులను, రష్యన్ సినిమాలను బ్యాన్ చేసింది. అప్పటి నుండి ఈ బ్యాన్ కొనసాగుతూ వచ్చింది.
2015 లో జెలెన్ స్కీ నటించిన లవ్ ఇన్ ది బిగ్ సిటీ 2 మూవీని ఉక్రెయిన్ లో బ్యాన్ చేశారు. ఎందుకంటే జెలెన్ స్కీ నటించిన సినిమాలన్నీ ఉక్రెయిన్ రష్యన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కాయి. అందుకే వాటిని బ్యాన్ చేశారు. ఆ తర్వాత జెలెన్ స్కీ 2015 నుండి 2019 మధ్య కాలంలో వచ్చిన ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ అనే టెలివిజన్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ లో జెలెన్ స్కీ, హైస్కూల్ హిస్టరీ టీచర్ పొజిషన్ నుండి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గా ఎదిగే రాజకీయ నాయకుడిగా కనబడతారు. ఉక్రెయిన్ ప్రభుత్వం యొక్క కరెప్షన్ కి వ్యతిరేకంగా 30 ఏళ్ల టీచర్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పోటీ చేసి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా గెలుస్తాడు. ఈ సిరీస్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మార్చి 2018 లో అదే సిరీస్ నేమ్ తో జెలెన్ స్కీ తన పొలిటికల్ పార్టీని స్థాపించారు.
ఈ సిరీస్ ఎండ్ అయ్యే సమయానికి సర్వెంట్ ఆఫ్ పీపుల్ పార్టీ ద్వారా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఊహించని విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాజకీయాల్లోకి రాక ముందు జెలెన్ స్కీ, 2014 లో రష్యా ఉక్రెయిన్ ల మధ్య డాన్ బాస్ భూభాగం కోసం జరిగిన వార్ లో పాల్గొన్న ఉక్రెయిన్ ఆర్మీ కోసం పాతిక లక్షల విరాళం ఇచ్చారు. అప్పటి నుండే ఆయనలో దేశభక్తి ఉంది. ఆ భక్తితోనే దేశం కోసం పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. తన సిరీస్ లో చూపించిన యాంటీ కరెప్షన్ సెంటిమెంట్ జెలెన్ స్కీ రాజకీయ జీవితానికి పునాది వేసింది. దీనికి తోడు మాజీ ఉక్రెయిన్ అధ్యక్షుడు పొరోషెంకో రష్యా తొత్తుగా వ్యవహరించడం, 2014 లో ఉక్రెయిన్ భూభాగమైన క్రిమియాని రష్యాకి చెందేలా వ్యవహరించడం, తూర్పు ఉక్రెయిన్ లో వేర్పాటువాద ఉద్యమానికి మద్ధతు ఇవ్వడం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయి.
ఇవే జెలెన్ స్కీకి బాగా కలిసి వచ్చాయి. రష్యా తొత్తుగా పిలవబడే పొరోషెంకోకి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. 2019 లో జెలెన్ స్కీకి 73.2 శాతం ఓట్లు రావడంతో 2019 మే 20న ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జెలెన్ స్కీ 2003 లో ఒలెనా కియాశ్కో అనే స్క్రీన్ రైటర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమెడియన్ గా, టెలివిజన్ నటుడిగా, హీరోగా, రాజకీయ నాయకుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్న జెలెన్ స్కీ ప్రస్తుతం తన దేశ ప్రజల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తలపడుతున్నాడు.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.