ఒకరు లేదా ఇద్దరు పిల్లలనే కంటున్న ఈరోజుల్లో.. ఒక మహిళ ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 40 ఏళ్ల ఈ సంతాన లక్ష్మిని అందరూ మామా అని పిలుస్తున్నారు.
ఇప్పుడు ఎక్కువ మంది పిలల్ని కనడం తగ్గిపోయింది. ఒకటి లేదా రెండు కాన్పుల తర్వాత పిల్లల్ని కనడం ఆపేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం అరడజను పిల్లల్ని కనేవారు. మన బామ్మల కాలంలో డజను మంది పిలల్ని కూడా కనేవారు. కానీ మన దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు చేపట్టాయి. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కనొద్దంటూ రూల్స్ తీసుకొచ్చాయి. అప్పట్లో బాగా ప్రచారం చేశాయి. దీంతో ఈ విషయంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు మహిళలు ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడం లేదు. మగపిల్లాడి కోసం ఇంకో కాన్పు చూసేవారూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఒక మహిళ ఏకంగా 40 ఏళ్లకే 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది.
ఉగాండా దేశానికి చెందిన మరియం నబంతాజీ అనే మహిళ ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నబంతాజీకి 12 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. పదమూడో ఏట తొలిసారి కవలలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 36 ఏళ్ల వయసు వచ్చేసరికి 42 మంది పిల్లలకు తల్లైంది. 40 ఏళ్లకు మరో ఇద్దరికి జన్మనిచ్చింది. ఈ సంతాన లక్ష్మిని స్థానికులు మామా అని పిలుస్తారు. ఆమె కాన్పుకు నలుగురు చొప్పున ఐదుసార్లు 20 మందికి ప్రాణం పోసింది. ఆమె సంతానంలో 6 మంది చిన్నారులు మృతి చెందారు. మిగిలిన 38 మందిని కంటికిరెప్పలా చూసుకుంటోంది. అయితే అధిక సంతానం కావడంతో నబంతాజీ భర్త కుటుంబాన్ని పోషించలేకపోయాడు.
భార్య మరియం పైనే పిల్లల పెంపకం భారం పెట్టి ఆమె భర్త పారిపోయాడు. దీంతో పిల్లలకు అన్నీ తానై సాదుతోంది. ఆమెకు జన్మించిన 38 మంది పిల్లల్లో 20 మంది అబ్బాయిలు, 18 అమ్మాయిలు ఉన్నారు. ఇంత మంది పిల్లలకు మరియం నబంతాజీ ఎలా జన్మను ఇచ్చిందని వైద్యులను ప్రశ్నిస్తే.. అందరు స్త్రీలల్లో ఉండే అండాల సంఖ్య కంటే నబంతాజీ అండాశయంలో ఎక్కువగా ఉండటం కారణంగానే హైపర్ వోయిలేషన్ అనే పరిస్థితికి దారితీసిందని చెబుతున్నారు. ఇకపోతే, భర్త వదిలివెళ్లడంతో పిల్లల్ని అనాథలను చేయలేక.. వారిని పోషించడం కోసం నబంతాజీ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. హెయిర్ స్టైలిస్ట్‌గా, ఈవెంట్ డెకరేటర్‌గా పనిచేస్తోంది. డబ్బులు సరిపోకపోవడంతో వనమూలికల ఔషధాలను కూడా తయారు చేసి విక్రయిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే విరాళాలతో తన బిడ్డలను ఆమె చదివిస్తోంది.