భారత్ లాంటి పలు దేశాల్లో ఒక్కరినే మాత్రమే పెళ్లి చేసుకునేందుకు చట్టాలు అనుమతిస్తాయి. అయితే కొన్ని దేశాల్లో బహుభార్యత్వానికి చాన్స్ ఉంది. ఇలా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే కల్చర్‌ను ఆఫ్రికా దేశాల్లో చూడొచ్చు. అక్కడి కొన్ని తెగల్లో పెళ్లి విషయంలో పెద్దగా నిబంధనలు ఉండవు. అయితే పేద దేశాల్లో బహుభార్యత్వం వల్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని ఘటనల్లో భార్యలు భర్తల్ని వదిలేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అలాంటి ఓ ఘటనే ఉగాండాలో చోటుచేసుకుంది.
ఉగాండాలో ఓ వ్యక్తి ఒకటి, రెండు కాదు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇక పిల్లల విషయం తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ వ్యక్తి తన 12 మంది భార్యలతో 102 మంది పిల్లల్ని కనేశాడు. ఇక నాకు పిల్లలు వద్ద బాబోయ్ అంటున్న ఆ వ్యక్తికి 578 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండటం ఉండటం గమనార్హం. ఉగాండాలోని బుగిసాలో ఉంటున్న ఆ వ్యక్తి పేరు ముసా హసహ్య. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. అయితే వంద మందికి పైగా కుటుంబ సభ్యులు ఉండటంతో వారందరికీ సరిపోయే ఆహారం, దుస్తులు లాంటి వాటిని సమకూర్చలేకపోతున్నాడు. దీంతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు ఇటీవలే ముసాను విడిచిపెట్టి వెళ్లిపోయారు.
పెద్దల మాట విని 12 మందిని పెళ్లాడానని.. 102 మందికి తండ్రిని అయ్యానని ముసా అన్నాడు. ఆయనకు తన పిల్లల్లో చాలా మంది పేర్లు కూడా గుర్తుండవన్నాడు. వారిని గుర్తించడంలో వారి తల్లుల సాయాన్ని తీసుకుంటానన్నాడు. కుటుంబంలో ఏవైనా విభేదాలు, సమస్యలు తలెత్తితే నెలకు ఒకసారి సమావేశమై వాటిని పరిష్కరించుకుంటామన్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.