మనిషి శరీరం చాలా విచిత్రమైనది. కోట్లు ఖర్చు చేసినా మానవ శరీరం లాంటి మిషిన్‌ను తయారు చేయలేము. శరీరంలోని ప్రతీ అవయవం ఎంతో చక్కగా తమ పని చేస్తాయి. ముఖ్యంగా గుండె ఓ అలుపెరుగని మిషిన్‌లా పని చేస్తుంది.
మానవ శరీరంలో గుండె ప్రధానమైన అవయవం. గుండె పని తీరు మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. గుండె ఆగిపోతే.. ప్రాణాలు పోయాయని అర్థం. అయితే, కొన్ని సార్లు గుండె ఆగినా కూడా ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది. ఇలాంటివి అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఓ బాలుడి గుండె దాదాపు మూడు గంటల పాటు ఆగిపోయింది. దీంతో కుటుంబసభ్యులు అతడు చనిపోయాడు అనుకున్నారు. కానీ, వైద్యులు ఎంతో చాకచక్యంగా ఆ బాలుడ్ని బ్రతికించారు. ఈ సంఘటన కెనడాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలోని ఒంటారియాకు చెందిన 20 నెలల వేలన్ సాండర్స్ అనే బాలుడు జనవరి 24న అనారోగ్యానికి గురయ్యాడు.
దీంతో అతడ్ని చార్‌లెట్ ఈలీనర్ ఎంగ్లెహార్ట్ హాస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడి గుండె ఆగిపోయింది. బాలుడి గుండె పని చేయటం లేదని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు సీపీఆర్ ఇవ్వటం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు నిర్విరామంగా సీపీఆర్ ఇచ్చారు. చివరకు ఎలాగైతేనేం బాలుడి గుండె తిరిగి కొట్టుకుంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీనిపై డాక్టర్ టేలర్ మాట్లాడుతూ.. ‘‘ అదంతా టీం ఎఫర్ట్ కారణంగా అయింది. ల్యాబ్ టెక్నీషియన్స్ పోర్టబుల్ హీటర్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ఈఎమ్‌ఎస్ సిబ్బంది కూడా ఎంతో సహాయం చేశారు. నర్సులు వేడి నీటిని తీసుకురావటంలో ఎంతో సహాయం చేశారు’’ అని చెప్పుకొచ్చాడు.
వేలన్ ఆరోగ్యం బాగుపడిని తర్వాత ఫిబ్రవరి 6న అతడ్ని ఇంటికి పంపారు. ఇంటి దగ్గర తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటున్నాడు. కాగా, గుండె లేకుండా కూడా మనుషులు బతికే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ గుండెను పెట్టడం ద్వారా ఓ వ్యక్తి నెల రోజుల పాటు బతికాడు. అది కూడా ఎలాంటి పల్స్ లేకుండా ఇన్ని రోజులు బతికాడు. మరో వ్యక్తి దాదాపు కృత్తిమ గుండెతో ఓ సంవత్సరం పైనే బతికి రికార్డు సృష్టించాడు. మరి, పిల్లాడి గుండె 3 గంటల పాటు నిలిచిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.