ఏ దేశమైనా తమ పరిస్థితులకు తగినట్లు ఆర్థిక వ్యవస్థను నడిపించుకోవాలి. దేశ పరిస్థితులకు అనుగుణంగా దేశాభివృద్ధి, ఇతర ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అలాకాకుండా ఇష్టానురీతిగా ఖర్చులు చేస్తే.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకోక తప్పదు. కొన్ని సార్లు ప్రభుత్వాలు తీసుకుని అనాలోచితన నిర్ణయాల కారణంగా కూడా దేశాలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటాయి. మనకు పొరుగున ఉన్న శ్రీలంకానే అందుకు ఉదాహరణ. అక్కడ స్థాయికి మించి అప్పులు చేయడం, ఇతర కారణలతో తీవ్రస్థాయిలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుపోయింది. కొన్ని నెలల నుంచి ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో ఎంతగా అల్లాడుతుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి మన పొరుగున్న ఉన్న మరోదేశం పాకిస్తాన్ కు వచ్చింది. ప్రస్తుతం ఆదేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. పాక్ మరో శ్రీలంకగా మారనుందా? అనే సందేలు వ్యక్తమవుతున్నాయి. మరి.. పాకిస్తాన్ లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందా.
చైనాపై అధికంగా ఆధారపడ్డ పాక్ పరిస్థితి కూడా శ్రీలంకలాగానే మారింది. పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే… ఆమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలును అమ్మేసేంతగా!, అలానే కొత్త బల్బులు, ఫ్యాన్ల తయారీని ఆపేసేంతగా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో పాటు భౌగోళిక, రాజకీయ సమస్యలతో విలవిల్లాడుతోంది. చాలా కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్.. చైనా సాయంపై ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో నిరుడు పాకిస్తాన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచాన్ని తాకిన ద్రవ్యోల్బణం ఆదేశంపై భారీగా ప్రభావం చూపింది.
ఎంతలా అంటే ఆ దేశ ద్రవ్యోల్బణం ఎన్నడు లేనంతగా 42 శాతం దాకా పెరిగిందటున్నారు అక్కడి ఆర్థిక నిపుణులు. మూలిగే నక్క మీద కొబ్బరి కాయపడినట్లు.. అసలే ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఆ దేశంలో గత జూన్ లో వచ్చిన వరదలు, వర్షాలు పరిస్థితిని మరింత దిగజార్చేలా చేశాయి. ఈ వరదల కారణంగా దాదాపు 3 వేల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచానా. దీంతో ఎగుమతులు తగ్గి, దిగుమతులపై ఆధారపడే పరిస్థితి పాక్ ఏర్పడింది. ఎగుమతులు తగ్గటంతో విదేశీమారక నిల్వలు భారీగా తగ్గాయి. మరోవైపు బెయిల్ అవుల్ ప్యాకేజీ విడతను ఐఎంఎఫ్ ఆలస్యం చేస్తుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితిని చూస్తే.. మరో శ్రీలంకలాగా మారనుందా? త్వరలో దివాళా తియ్యనుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన పొదుపు కోసమని పాకిస్తాన్ వ్యాప్తంగా విద్యుత్ వాడకంపై ఆంక్షలు విధించారు. కొన్ని రోజుల పాటు బల్బులు, ఫ్యాన్ల తయారీపై నిషేధం విధించారు. అంతేకాక రాత్రి 8.30 గంటల కల్లా అన్ని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, దుకాణాలు మూసేస్తున్నారు. పెళ్లి వేడుకలను కూడా రాత్రి 10.30 లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఆ దేశాలు వెలువడ్డాయి. ఇలా చేయడం ద్వారా 600 కోట్లు ఆదా చేస్తామన్నది ఆ దేశ ప్రభుత్వ అంచానా. ఇక నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రెండు వారాల్లోనే 15 కేజీల పిండి ధర రూ.300 పెరిగి.. రూ.2050 కి చేరింది. అదే విధంగా చెక్కర , నెయ్యి ధరలు 25 శాతం నుంచి 62 శాతానికి పెరిగాయి. గ్యాస్ ధర ఏకంగా రూ.3000 దాటింది. ప్రస్తుతం ఆ దేశ ప్రజలు ఆర్ధిక సంక్షోభంతో అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలకు తట్టుకోలేక ఆకలితో అలమటిస్తున్నారు. అంతేకాక జూన్ 2023 వరకు 30 బిలియన్ డాలర్ల విదేశీ అప్పును పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. దేశ జీడీపీ వృద్ధి మాత్రం 2 శాతమే ఉంది. ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఆర్థిక సంక్షోభంతో దివాళా తీయడం ఖాయంగా ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.