ప్రజల చేత ప్రజలకోసం ఎన్నుకోబడిన వారు పార్లమెంట్ లో సభ్యులుగా కొనసాగుతుంటారు. వారు ప్రజల అభివృద్ధి కోసం చట్టాలు, శాసనాలను చేస్తుంటారు. అయితే అక్కడ కూడా అధికార, ప్రతి పక్షాలు అనేవి ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లలు, పథకాల అమలు పై ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో కొందరి కారణంగా దేవాలయాలుగా భావించే అసెంబ్లీ, పార్లమెంట్ లు అపహాస్యం అవుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పార్లమెంట్ లోనే ఒకరి పై ఒకరు దాడులు చేసుకోవడం, కుర్చీలు, వాటర్ బాటిల్స్ వంటివి విసురుకోవడం చేస్తుంటారు. చివరికి అక్కడ ఉండే వస్తువులను సైతం ధ్వంసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా పలు పార్లమెంట్లలో చోటుచేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే సెనెగల్ పార్లమెంట్ లో చోటుచేసుకుంది.
శుక్రవారం సెనెగల్ పార్లమెంట్ లో సమావేశం జరిగింది. ఈ క్రమంలో అధికార, ప్రతి పక్షాలకు చెందిన పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ క్రమంలో పలు రకాల అంశాలపై అధికార పార్టీ వారు చర్చిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన వారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనలు తెలియజేశారు. అంతటితో ఆగక స్పీకర్ పోడియం వద్దకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. ఈక్రమంలోనే సెనెగల్ పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్ సంబ్ శృతిమించి ప్రవర్తించారు. తోటి పార్లమెంట్ సభ్యురాలు యామి నదియా గింబేను చెప్పుతో కొట్టారు. దీంతో ఘర్ణణ తీవ్ర స్థాయికి చేరింది. పార్లమెంట్ లో ఒక సారిగా ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఎంపీలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. అంతటితో ఆగక చొక్కలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీరు పశువులా? ఇంకేమైననా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం ప్రజల దౌర్భాగ్యం అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.