టైటానిక్ షిప్‌ను దగ్గరినుంచి చూసేందుకు దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి సబ్ మెరైన్ ఎక్కారు. ఆదివారం ఉదయం యాత్ర మొదలైంది. యాత్ర మొదలైన కొన్ని గంటల్లోనే...
1912.. ఏప్రిల్ నెల.. అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ షిప్ ప్రమాదానికి గురైంది. సముద్రంలోని పెద్ద ఐస్ ముక్కను ఢీకొట్టడంతో టైటానిక్ ముక్కలై సముద్రం అడుగు భాగంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా చనిపోయారు. ఎంతో మంది తమ వారిని కోల్పోయి అనాథలయ్యారు. ఇక, ఈ ఘటన జరిగి వందేళ్లకు పైనే అవుతోంది. ఈ వందేళ్లలో టైటానిక్ షిప్ ఖ్యాతి పెరిగిందే కానీ, తగ్గలేదు. టైటానిక్ అంశంపై పలు సినిమాలు, కథలు వచ్చాయి. టైటానిక్ షిప్ పరిస్థితులను తెలుసుకోవటానికి చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నీటిలో తుప్పు, పాచి పట్టిపోయిన షిప్ శకలాల తాలూకా ఫోటోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. కొన్ని కిలోమీటర్ల లోతులో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను నేరుగా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి చూపుతూ వచ్చారు.
దీన్ని అమెరికాకు చెందిన ఓషన్ గేట్ అనే ప్రైవేట్ సంస్థ తమ బిజినెస్ ఐడియాగా మార్చుకుంది. టైటానిక్ షిప్‌ను చూడటానికి వీలుగా ‘టైటాన్’ అనే సబ్ మెరైన్‌ను తయారు చేసింది. సాధారణ సబ్ మెరైన్‌ల కంటే టైటాన్ ఎంతో ప్రత్యేకమైనది, దృఢమైనదని కంపెనీ చెప్పుకొచ్చింది. టైటాన్‌లో ప్రయాణం చేసి నడి సముద్రంలో ఉన్న టైటానిక్‌ను చూసి రావచ్చొని ప్రకటించింది. టైటానిక్ అంటే ఎంతో ప్రేమ ఉన్న ధనికులు యాత్రకు సిద్ధమయ్యారు. మొత్తం 8 రోజుల ప్రయాణం కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలు చెల్లించారు. 21 అడుగుల పొడువున్న ఈ సబ్ మెరైన్‌లో మొత్తం 5 మంది ప్రయాణానికి సిద్దమయ్యారు.
బ్రిటన్‌కు చెందిన హమిష్ హార్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన సంపన్నుడు షహ్‌జాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, టైటానిక్ నిపుణుడు పాల్ హెన్రీ నార్గలెట్, ఓషన్ గేట్ సీఈఓ స్టాక్‌స్టన్ రష్‌తో పాటు ఒక సిబ్బంది ప్రయాణమయ్యారు. జూన్ 18న ఈ యాత్ర మొదలైంది. ఆదివారం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌నుంచి ప్రయాణం మొదలైంది. ప్రయాణం మొదలైన గంటన్నరకే టైటాన్ మిస్ అయింది. సబ్‌మెరైన్‌కు బయటి ప్రపంచంతో సంబధాలు తెగిపోయాయి. గంటలు గడుస్తున్నా టైటాన్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవటంతో వెతుకలాట మొదలైంది.
నాలుగు రోజుల నుంచి సెర్చ్ ఆఫరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఆ సబ్ మెరైన్‌లో ఆక్సిజన్ లెవల్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఆ సబ్ మెరైన్‌లో ఉన్న 96 గంటల అత్యవసరం ఆక్సిజన్ నిల్వలు గురువారం సాయంత్రానికి పూర్తిగా అయిపోయాయి. దీంతో సబ్‌మెరైన్‌లోని 5 గురు ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా తీర రక్షక దళం టైటాన్ సబ్ మెరైన్ శకలాలను గుర్తించినట్లు సమాచారం. వారి పంపిన రిమోట్ కంట్రోల్ వాహనం టైటాన్‌ను భాగాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అప్పటి టైటానిక్ లాగానే.. ఇప్పటి టైటాన్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది.