ఈ రోజుల్లో అందరూ డబ్బు మంత్రమే జపిస్తున్నారు. జాబ్ చేసినా, వ్యాపారం చేసినా డబ్బే ప్రధానమైపోయింది. మానవతా విలువలు, ప్రేమానురాగాల కంటే డబ్బులకు ఇచ్చే ప్రాధాన్యతే ఎక్కువైపోయింది. దాదాపుగా అన్నింటికీ డబ్బే మూలం అయిపోయింది. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి వచ్చిందేమో అనిపిస్తోంది. ఇకపోతే, మనుషుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు, మిలయనీర్లు, బిలియనీర్లు అంటూ బాగా సంపాదించే వారి గురించి చెప్పుకుంటాం. కానీ జంతువుల్లో.. అందులోనూ శునకాలు ధనికులుగా ఉండటం గురించి ఎప్పుడైనా విన్నారా?
పెంపుడు జంతువులను తమ ఇంట్లోని సభ్యులుగా చూసుకోవడం, వాటికి పుట్టిన రోజులు, ప్రసవాలు లాంటివి చేయడం కామనే. పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకోవడం వరకు ఓకే.. కానీ వాటికి ఆస్తి రాసివ్వడం గురించి ఎప్పుడూ వినుండరు కదా. అవును, ఓ కుక్కకు కోట్లాది రూపాయల సంపద, పెద్ద పెద్ద లగ్జరీ కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే నమ్ముతారా? దానికి సపర్యలు చేసేందుకు పని మనుషులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యమేస్తోందా? అంతేకాదండోయ్ దాని పేరు మీద ఓ కంపెనీ కూడా ఉంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.
ఇటలీకి చెందిన గుంథర్ అనే శునకం కోటీశ్వరురాలు. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క ఒకప్పుడు పాప్ స్టార్ మడోన్నా ఇంట్లో ఉండేది. ఇప్పుడు వేరే ధనవంతుడి ఇంట్లో ఉంటోంది. కౌంటెస్ కార్లోటా లీబెన్ స్టెయిన్ అనే కోటీశ్వరుడి నుంచి గుంథర్ కోట్ల ఆస్తిని పొందింది. లీబెన్ స్టెయిన్ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడికి వారసుడు లేకుండా పోయాడు. అలాంటి పరిస్థితుల్లో తాను చనిపోయే ముందు 1992లో ఓ ట్రస్టును నెలకొల్పాడు. తనకు ఇష్టమైన ఈ కుక్క కోసం రూ.655 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని రాసిచ్చాడు.
గుంథర్ సంరక్షణ బాధ్యతలను కొందరు పని మనుషులకు అప్పగించాడు. ఇలా ఈ గుంథర్ కోటీశ్వరురాలు అయింది. ఈ కుక్క కథపై ఓ డా
క్యుమెంటరీ కూడా తెరకెక్కింది. దీన్ని ఆరేలియన్ లెటర్జీ తెరకెక్కించారు. ప్రపంచంలో అత్యంత ధనిక శునకం గురించి తెలుసుకునేందుకు చాలా మంది తమ డాక్యుమెంటరీ చూస్తున్నారని దర్శకుడు ఆరేలియన్ తెలిపారు. మరి, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఈ రిచెస్ట్ డాగ్ లైఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.