మీటింగ్ మధ్యలో తరుచూ మొబైల్., ల్యాప్‌టాప్‌కి చార్జింగ్ అయిపోవడం ఎక్కడికి వెళ్లినా పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లడం అందరికీ సాధ్యం కాదు. దీనికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అదే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది.
శరీరంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉన్న భాగాల్లో వేళ్లు ఒకటి. వేళ్ల ద్వారానే అత్యధికంగా చెమట విడుదల అవుతుంది. అయితే, వేళ్లకు గాలి ఎక్కువగా తగిలే అవకాశం ఉండటంతో స్వేదం త్వరగా ఆవిరైపోతుంది. దీంతో వేళ్లకు చెమట పట్టినట్టు అనిపించదు. వేళ్లకు ఈ స్ట్రిప్‌ను అమరిస్తే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్‌లో కార్బన్ ఫోమ్ ఎలక్ట్రోడ్లు, ఆక్సిజన్, లాక్టేట్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి. వేళ్ల మీద స్వేద బిందువులను గ్రహించినపుడు రసాయనిక చర్య జరిగి విద్యుత్ పుడుతుంది. స్ట్రిప్‌లోని కెపాసిటర్‌లో దీన్ని స్టోర్ చేస్తుంది. చిప్‌పై ఒత్తిడి పడితే కూడా పవర్ పుడుతుంది. దీనికి ఎలక్ట్రోడ్ కిందనున్న ‘పైజోఎలక్ట్రిక్’ సాయపడుతుంది.
మొబైల్స్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్, వాచ్, ఐపాడ్స్, మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పియానో, బల్బులు వంటి వాటికి ఈ స్ట్రిప్ సాయంతో విద్యుత్‌ను అందించవచ్చు. రెండురోజులపాటు పది వేళ్లకు ఈ స్ట్రిప్‌లను ధరిస్తే ఫోన్ ఫుల్ చార్జింగ్ చేయొచ్చు.