ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. అయితే కొన్ని ధనిక దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని బూస్టర్ డోసుల వైపు అడుగులు వేస్తున్నాయి. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేస్తున్న కొన్ని దేశాలు ఇక బూస్టర్ డోసుల వైపు చూస్తున్నాయి. ఎక్కువ కాలం ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం ఈ బూస్టర్ డోసులను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే బూస్టర్ డోసులు వద్దని వారిస్తోంది.
ధనిక దేశాలు వ్యాక్సిన్ డోసులు పూర్తిగా పంపిణి చేయగా పేద దేశాలు మాత్రం ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందని డబ్ల్యూహెచ్‌వో ‘హెడ్’ – టెడ్రోస్ అదనోమ్ అన్నారు. ప్రపంచంలో కనీసం 10శాతం మందికి రెండు డోసులు వేసేలా ముందు చర్యలు తీసుకోవాలని ఆ తరువాత మూడో డోస్ గురించి ఆలోచించాలని కోరారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంకా మొదటి డోస్ పూర్తి కాలేదని, అనేక దేశాల్లో వ్యాక్సిన్ కొరతలు ఉన్నాయని, ఆయా దేశాలకు వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. కనీసం సెప్టెంబర్ వరకు బూస్టర్ డోస్ ఆలోచనను మానుకోవాలని ఆయన సూచించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ యాక్సెస్ మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే ధనిక దేశాలకు పిలుపునిచ్చింది. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు వేసే విషయాన్ని కనీసం సెప్టెంబరు ముగిసేవరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు సూచించింది.