స్పానిష్ హైకోర్టు ఓ కేసులో ఊహించని తీర్పు ఇచ్చింది. నగ్నంగా నడిచేందుకు అనుమతి కావాలంటూ కోర్టును ఆశ్రయించిన ఒక యువకుడికి ధర్మాసనం మద్దతుగా నిలిచింది. వీధుల్లో నగ్నంగా నడుస్తానన్న ఆ యువకుడికి కోర్టు అనుమతిని ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. స్పెయిన్‌కు చెందిన 29 ఏళ్ల అలెజాండ్రో కోలోమర్ అనే యువకుడు గత మూడేళ్లుగా అక్కడి వీధుల్లో నగ్నంగా తిరుగుతున్నాడు. ఈ మధ్య రెండుసార్లు అల్దియా నగర వీధుల్లో కూడా అతడు తిరిగాడు. దీంతో అధికారులు అతడికి జరిమానా విధించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించాడు కోలోమర్. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. అలెజాండ్రో కోలోమర్‌కు మద్దతుగా నిలిచింది. పౌరుల భద్రత, ప్రశాంతతపై కోలోమర్ ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపడం లేదని కోర్టు తెలిపింది.
బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం తప్పేమీ కాదని స్పానిష్ చట్టాల్లో ఉందని కోలోమర్ కేసు విచారణ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. కాగా, తాను 2020 నుంచి పబ్లిక్ ప్లేసెస్‌లో నగ్నంగా తిరుగుతున్నానని కోలోమర్ తెలిపాడు. అయితే తనకు ప్రజల నుంచి మద్దతు లభించలేదని.. పెద్ద ఎత్తున ఛీత్కారాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఒకసారి కొందరు తనను కత్తితో చంపేస్తానంటూ బెదిరించారని వాపోయాడు. కాగా, స్పెయిన్‌లో 1988లోనే పబ్లిక్ న్యూడిటీని చట్టబద్ధం చేశారు. దీంతో నగ్నంగా తిరుగుతున్న కోలోమర్‌ను అధికారులు అరెస్టు చేయలేదు. కానీ అల్దియా అధికారులు మాత్రం అతడికి ఫైన్ వేశారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఇకపోతే, కోర్టు విచారణకు కోలోమర్ బట్టలు లేకుండానే వచ్చాడు. అయితే అధికారులు అతడ్ని దుస్తులు వేసుకుని రమ్మని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక కోలోమర్ బట్టలు వేసుకుని విచారణకు హాజరవ్వడం గమనార్హం. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.