ప్రపంచంలో సాధారణ ఉద్యోగాలతో పాటు.. వింత, విచిత్రమైన జాబులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల నిద్రపోవటానికి, ఏడ్వటానికి అంతెందుకు క్యూలైన్లో నిల్చోవటానికి కూడా జీతాలు ఇస్తారు.
సాధారణంగా ఎవరైనా పని చేస్తేనే జీతమిస్తారు. కానీ, కొన్ని దేశాల్లో పరుపులపై నిద్రపోయినా… క్యూలైన్లో నిల్చున్నా.. శవం దగ్గర ఏడ్చినా కూడా జీతమిస్తారు. ఇలాంటి జాబ్స్ ఉంటాయా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే నండీ.. ఆ విచిత్ర ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఆఫీసుల్లోగానీ, పనిచేసే చోటగానీ నిద్రపోతే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ, ఫిన్లాండ్ లోని ఒక హోటల్లో ప్రొఫెషనల్ స్లీపర్స్ పేరిట ఉద్యోగాలు ఇస్తారు. ఇలాంటి ఉద్యోగాలను పరుపులు తయారు చేసే కంపెనీలు, కొన్ని హోటళ్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. బెడ్ పై పడుకుని అవి సౌకర్యంగా ఉన్నాయా లేదా అనే రిపోర్ట్ ఇవ్వాలి. ఇందుకోసం వీరికి నెలకు రూ. లక్షల్లో జీతాలు చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయట అవేంటంటే..పరుపులపై నిద్రించి వాటి నాణ్యతను తెలుసుకోవాలి, ఎక్కువసేపు నిద్ర పోవాలనే కోరిక ఉండాలి, చుట్టు పక్కల ఏమి జరిగినా పట్టించుకోకుండా హాయిగా నిద్ర పోగలగాలి. ఈ అనుభవాలను తెలుపుతూ టిక్ టాక్ వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయాలి. బెంగుళూరులో కూడా ‘వేక్ ఫిట్’ అనే సంస్థ నిద్రపోతే నెలకు రూ. లక్ష జీతమిస్తానంటూ ఆఫర్ చేస్తోంది. క్యూలో గంటల కొద్ది నిలబడడం కొందరికి వీలుకాదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయసులో పెద్దవారు, చంటిపిల్లల తల్లులు క్యూలో నిలబడలేరు. అందుకే ఇలాంటి వారి కోసం కూడా కొంతమంది ఉన్నారు. క్యూలో నిలబడటానికి ఇబ్బంది పడేవారికి బదులుగా ఈ క్యూ లైన్ ఉద్యోగులు నిలబడతారు.
అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఈ ఉద్యోగులు కనిపిస్తూ ఉంటారు. ప్రముఖ షాపింగ్ మాల్స్ లో ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు వీరికి డిమాండ్ ఉంటుంది. విదేశాల్లో ‘పాసింజర్ పుషర్స్’ ఉద్యోగాలు కూడా ఉంటాయి. మెట్రో రైలు లోపలికి ప్రయాణికులను తోసేయడమే వీరి పని. పండుగలు, ప్రత్యేక రోజులల్లో మెట్రో రైలు గుమ్మాల దగ్గర వేలాడుతున్న జనాలను అదుపుచేసి మెట్రో రైలు డోర్లు వేసుకునేలా చేస్తారు. వీరికి రూ.70 నుండి రూ.75వేల వరకు జీతం చెల్లిస్తారు. చైనా, ఆఫ్రికా, యూకే వంటి దేశాల్లో ఎవరైనా చనిపోతే ఏడ్చేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులు ఉంటారు. వీరు ఏడవడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులను, బంధువులను కూడా ఓదార్చాలి. ఇలా ఈవెంట్స్ నిర్వహిస్తారు. ప్రతి ఈవెంట్ కు రూ.9వేల నుండి రూ.16 వేల వరకు చెల్లిస్తారు. మరి, ఈ వింత జాబులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.