చేతిలో స్మార్ట్ ఫోన్ జారి కింద పడితే మళ్లీ వాడటానికి వీలులేకుండా ఒక్కోసారి స్క్రీన్ మొత్తం పగిలితుంది. తీసి పరిశీలించేలోగా నేలపై ఉన్న ఫోన్లో కదలిక మొదలైంది. క్షణాల్లోనే స్క్రీన్‌పై పగుళ్లు మాయం అయ్యాయి. కన్నుమూసి తెరిచేంతలో పగిలిన ఫోన్ మళ్లీ పూర్వస్థితికి చేరింది. ఇలాంటివి ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూశాం. భవిష్యత్తులో నిజంగానే చూడబోతున్నాం. దీనికి ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు సాయపడబోతున్నాయి.
ఎలక్ట్రానిక్ పరికరాలు స్వయంగా రిపేర్(సెల్ఫ్ హీలింగ్) చేసుకోవడానికి వీలు కల్పించే లోహాలను కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్), ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కేంద్రప్రభుత్వం నుంచి ప్రఖ్యాత స్వర్ణజయంతి ఫెలోషిప్ పొందిన ప్రొఫెసర్ మల్లారెడ్డి, ఆయన బృందం ఐఐఎస్‌ఈఆర్‌లో ఈ లోహాలను కృత్రిమంగా తయారు చేసింది.
శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు గాయం చుట్టు ఉన్న కణాలు ఎలాగైతే కణజాలాలను ఉత్పత్తి చేసి గాయాన్ని పూడుస్తాయో అలాగే ఈ ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఫోన్లు, టీవీ స్క్రీన్లు ఇలా చాలా వాటి తయారీలో ఈ లోహాలు కీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలను తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.
ఏరోస్పేస్, ఇంజినీరింగ్, ఆటోమేషన్‌లో వినియోగించినట్టు పేర్కొన్నారు. అయితే కొత్తగా తయారు చేసిన లోహాలకు, వీటికి చాలా తేడా ఉందని తెలిపారు. పాత వాటి కంటే ఇవి 10 రెట్లు దృఢమైనవని పేర్కొన్నారు. అవి సెల్ఫ్ హీల్ కావాలంటే కాంతి, వేడి, ఏదో ఒక రసాయనం అవసరం పడేదని పేర్కొన్నారు. తాజా లోహాలు ఎలక్ట్రానిక్ పరికరాల్లోని చార్జింగ్ ఆధారంగానే బాగవుతాయని చెప్పారు.