కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. అయితే వ్యాక్సిన్ల వల్ల వైరస్ బారి నుంచి త్వరగా బయటపడటం సాధ్యమైంది. అలాంటి కొవిడ్ టీకాను తయారు చేసిన ఓ శాస్త్రవేత్త మృతి చెందారు.
కరోనా మహమ్మారి మానవాళిని ఎంతగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ వల్ల లక్షలాది మంది తమ ఆప్తులను, కుటుంబీకులను, మిత్రులను కోల్పోయారు. ప్రాణ నష్టమే కాకుండా తీవ్రస్థాయిలో ధన నష్టం కూడా జరిగింది. వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్లతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. చిరు వ్యాపారాలు మూసుకుపోయాయి. ఇలా చెబుతూ పోతే.. వైరస్ మన జీవితాలకు చేసిన హాని అంతా ఇంతా కాదు. అలాంటి ప్రమాదకర కరోనా వైరస్‌కు టీకాను కనిపెట్టిన సైంటిస్టుల బృందంలో ఒకరు చనిపోయారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన రష్యన్ శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
కొవిడ్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ని తయారు చేసిన అగ్రశ్రేణి రష్యా సైంటిస్టుల్లో ఆండ్రీ బోటికోవ్ ఒకరు. 47 ఏళ్ల ఆండ్రీ బోటికోవ్ తన అపార్ట్మెంట్లోనే శవమై కనపించారు. గామాల్యే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మాథమెటిక్స్‌లో ఆయన సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. బోటికోవ్ చేసిన కృషికి గానూ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్ల్యాండ్ పురస్కారంతో సత్కరించారు. కాగా, బోటికోవ్ ఇంట్లోకి దూరి.. ఎవరో ఆయన్ను బెల్ట్‌తో గొంతు కోసి చంపారని సమాచారం. ఈ మేరకు దీన్ని హత్య కేసుగా పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రష్యన్ దర్యాప్తు అథారిటీ పేర్కొంది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశామని రష్యా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.